Why did Yes Bank collapse?
ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన యెస్ బ్యాంకు ఖాతాదారులకు టెన్షన్ పెడుతుంది. చాలాకాలం నుంచీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న ఈ బ్యాంకును రిజర్వుబ్యాంకు స్వాధీనం చేసుకుంది. నగదు ఉపసంహరణపై ఆంక్షలను విధించింది. ఇకపై ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి 50 వేల రూపాయల వరకు మాత్రమే నగదును ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని రిజర్వుబ్యాంకు వెల్లడించింది. యెస్బ్యాంక్ సంక్షోభంపై ఆ బ్యాంకు కస్టమర్లలో ఆందోళన నెలకొనడంతో వారికి భరోసా ఇచ్చేందుకు కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యెస్బ్యాంక్లో పాలనా విభాగం అత్యంత దయనీయస్థితికి చేరుకుందని చెప్పిన నిర్మలా సీతారామన్… రుణాల మంజూరు విషయంలో ఇతరత్రా విషయాల్లో యెస్ బ్యాంక్ హద్దులు దాటిందని చెప్పారు. ఇందుకోసమే ఆర్బీఐ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టిందని ఆ విషయం ప్రభుత్వానికి తెలిపిందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఒక నెలరోజుల సమయంలోనే అన్నీ చక్కబడుతాయని చెప్పిన మంత్రి నిర్మలా సీతారామన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యెస్బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.బ్యాంకులో డిపాజిట్ చేసినవారికి ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. ప్రతి డిపాజిటర్ డబ్బులు సురక్షితంగా ఉంటాయని భరోసా ఇచ్చారు మంత్రి. ఇక ఉద్యోగులకు కూడా ఒక ఏడాది వరకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని చెప్పారు. ఇక యెస్ బ్యాంక్‌లో రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరిని విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఇక డిపాజిటర్లు డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు రూ.50వేల పరిమితి తాత్కాలికంగానే ఉంటుందని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్.ఇక యెస్బ్యాంక్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తున్నారో రిజర్వ్ బ్యాంక్ తన వెబ్సైట్లో పొందుపరిచిందని చెప్పిన మంత్రి ప్రజల నుంచి సలహాలు సూచనలను స్వాగతిస్తోందని చెప్పారు. డ్రాఫ్ట్ స్కీమ్‌పై యెస్ బ్యాంక్ వాటాదారులు, డిపాజిటర్లు రుణాలు తీసుకున్నవారు కూడా సూచనలు సలహాలు ఇవ్వొచ్చని నిర్మలా సీతారామన్ చెప్పారు.