zoo opens from oct 6th
రేపటి నుంచి అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నగర, పట్టణ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు, కోవిడ్ నిబంధనలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ సందర్శకులకు పార్కు ల లోపలికి అనుమతించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అక్టోబర్ 6 (జూ డే) నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ లోకి సందర్శకులను అనుమతించనున్నట్లు మంత్రి చెప్పారు. వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ఉన్న చోట నీటిని తొలగించి, పార్కు ను పూర్తిగా శుభ్రపరచాలని జూ అధికారులను ఆదేశించారు. అన్ని రాష్ట్రాల అటవీ పర్యావరణ మంత్రుల సమావేశంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అర్బన్ ఫారెస్ట్ పార్కులను తెరవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను గతంలోనే కోరిన సంగతి తెలిసిందే. కేబీఆర్ పార్కును కూడా శనివారం నుంచి తెరుస్తున్నామని, వాకర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేబీఆర్ పార్కు వాకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జయవీర్ రెడ్డి తెలిపారు.