రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా అభ్యర్థిని ప్రకటించారు. అనేకమంది పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఝార్ఖండ్ మాజీ గవర్నర్‌గా పని చేసిన ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అన్నారు. మంత్రిగా, గవర్నర్‌గా ఆమె రాణించారని ప్రశంసించారు.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి రాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశం ఇస్తారని ఆశించిన తెలుగు ప్రజలకు తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. వాస్తవానికి మొదట్నుంచి కేంద్రం.. తెలుగు నాయకుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని చెప్పడానికిదే తాజా నిదర్శనం.