తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఖాయం?

7
YSR SHARMILA POLITICAL PARTY
YSR SHARMILA POLITICAL PARTY

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా వైఎస్ కుటుంబం పెద్దగా ఖండించలేదు.. అలాగని నిజమే అని చెప్పలేదు. అయితే, తెర వెనుక జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలని షర్మిల నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం లోటస్ పాండ్ లోని తమ నివాసంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని షర్మిల ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు అక్కడకు చేరుకుని షర్మిలకు అనుకూలంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బయటకు వచ్చిన షర్మిల వారందరికీ అభివాదం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ అభిమానులతో మాట్లాడే ఉద్దేశంతోనే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, దానికి మళ్లీ ఎందుకు తెచ్చుకోకూడదన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికే అందరినీ కలుసుకుంటున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా తొలుత నల్లగొండ జిల్లా నాయకులతో ఆమె సమావేశం అవుతున్నారు.