Smoke Drains your life and Harms you
సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి కాల్చటం ఆరోగ్యానికి హానికరమన్నది తెలిసిందే. వీటిని ఎంత ఎక్కువగా కాల్చితే అంత ఎక్కువ అనర్థం కలుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. 50 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టటానికి ముందు ఎక్కువగా సిగరెట్లు తాగే పురుషులకు పక్షవాతం ముప్పు మరింత ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. పొగ తాగటానికీ పక్షవాతానికీ సంబంధం ఉంటున్నట్టు గతంలో చేసిన అధ్యయనాల్లోనూ వెల్లడైంది. అయితే అసలే సిగరెట్లు తాగనివారితో పోలిస్తే.. రోజుకు 2 పెట్టెల కన్నా ఎక్కువ సిగరెట్లు కాల్చే మగవారికి పక్షవాతం వచ్చే అవకాశం 5 రెట్లు అధికంగా ఉంటున్నట్టు అమెరికా పరిశోధకులు గుర్తించారు. రోజుకు 11 కన్నా తక్కువ సిగరెట్లు కాల్చేవారికి పక్షవాతం ముప్పు 46 శాతం ఉంటున్నట్టు గమనించారు. యువకులుగా ఉన్నప్పుడే పొగ మానెయ్యటం ఉత్తమమని ఇది సూచిస్తోందని పరిశోధకులు తెలిపారు. ఒకవేళ సిగరెట్ల సంఖ్యను తగ్గించినా కూడా పక్షవాతం ముప్పు తగ్గే అవకాశముందన్నారు. పొగ తాగటం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. దీంతో రక్తం మరింత చిక్కగా తయారై రక్తం గడ్డలు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది రక్తనాళాలు మూసుకుపోయేలా చేసి పక్షవాతం, గుండెపోటు ముప్పును పెంచుతుంది .