– షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డాకు మహారాజ్’ చిత్రం
– సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న భారీస్థాయిలో విడుదల
అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతోనూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. బాలకృష్ణ తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
కేవలం ప్రకటనతోనే ‘డాకు మహారాజ్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రచార చిత్రాలతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నందమూరి అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చూడాలనే ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది.
తన చిత్రాలలో కథానాయకులను సరికొత్తగా చూపించడంలో దర్శకుడు బాబీ కొల్లి దిట్ట. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న ‘డాకు మహారాజ్’లోనూ, బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్నారు.