పవన్ కళ్యాణ్ కు పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆసక్తి లేకున్నా పట్టుబట్టి నిర్మాత ఎ.ఎమ్. రత్నం హరిహర వీరమల్లు ప్రాజెక్టును లైన్ లో పెట్టాడు. ఇక తీరా ఆ సినిమా పవన్ పాలిటిక్స్ కారణంగా వాయిదాలతో ఇబ్బంది పడింది. చివరకు దర్శకుడు క్రిష్ మరో ప్రాజెక్టుకు షిఫ్ట్ కావడంతో జ్యోతికృష్ణ ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా కంటెంట్ పై ఆడియెన్స్ లో ఇప్పటికి ఒక క్లారిటీ అయితే లేదు.
మూడు సంవత్సరాల విరామం తర్వాత, పవన్ కల్యాణ్ ఈ వేసవిలో ప్రేక్షకులను అలరించడానికి మళ్లీ వెండితెరపైకి రానున్నారు. భీమ్లానాయక్ చిత్రం అనంతరం ‘హరిహరవీరమల్లు’తో బాక్సాఫీస్ బద్దలకొట్టడానికి రెఢీ అవుతున్నారు. ఈసారి, కేవలం నటన మాత్రమే కాదు. ఆయుధధారణతో, యుద్ధానికి సిద్ధంగా ఉన్న పవన్ కల్యాణ్, పీరియాడిక్ డ్రామా ‘హరి హర వీర మల్లు’లో 20 నిమిషాల యాక్షన్ సన్నివేశాన్ని డిజైన్ చేసే బాధ్యతను కూడా తీసుకున్నారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఓ స్టంట్ మాస్టర్‌గా కూడా తన ప్రతిభను ఈ చిత్రం ద్వారా ఓ 20 నిమిషాల భారీ సన్నివేశం ద్వారా అందరికీ గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో చిత్రీకరించారు.
“ఈ సినిమాలో మొత్తం ఆరు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కానీ ఈ సన్నివేశమే అత్యంత భారీగా ఉంటుంది. పవన్ దాన్ని విజువలైజ్‌గా చాలా అద్భుతంగా చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇది దాదాపు 20 నిమిషాల పాటు నడుస్తుంది. హైదరాబాదులోని ప్రైవేట్ స్టూడియోలో 61 రోజులపాటు, 1100 మందికి పైగా కళాకారులతో చిత్రీకరించారు” అని దర్శకుడు జ్యోతికృష్ణా చెప్పారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్లు నిక్ పౌెల్, టాడోర్ లాజారోవ్ (అకా జోజీ), సౌత్ ఆఫ్రికా ఫైట్ మాస్టర్‌లు కలసి ఈ సన్నివేశాన్ని రూపొందించడానికి పవన్ తో కలిసి వీరందరూ కూడా పనిచేశారు.
పవన్ పాన్ ఇండియా, హిస్టారికల్ నేపథ్యం అనే అంశాలు మాత్రమే కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. “ముగల్ సామ్రాజ్యం నాటి 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీర మల్లు అనే వీరుడి సాహసాల చరిత్ర ఆధారంగా ఈ కథ సాగుతుంది. ఈ పాత్ర కోసం పవన్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆయుధాలను నిర్వహించడం, గుర్రపు స్వారీ, కత్తియుద్ధాలు, ఈటెతో రకరకాల పోరాటాలతో అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఈ పోరాట సన్నివేశాలను పవన్ చిత్రీకరించారు.
“అలాగే, షోలిన్ కుంగ్ ఫూ ఆయుధాలపై కూడా ప్రత్యేక శిక్షణ పొందారు. గతంలో ఆయన నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అనుభవంతో పవన్ త్వరగా శిక్షణను అర్థం చేసుకుని స్క్రీన్‌పై ప్రదర్శించగలిగారు” అని దర్శకుడు జ్యోతికృష్ణా చెప్పారు. పవన్ కత్తి సాము పోరాటాలు, యుద్ధ వాతావరణం బిగ్ స్క్రీన్ కు కనుల విందుగా ఉంటుందట. ఈ యుద్ధ సన్నివేశానికి తగినట్టుగా టెక్నికల్ ఎలిమెంట్స్ ద్వారా హాలీవుడ్ స్థాయి విజువల్స్, సంగీతం ఏర్పాటు చేస్తామని చిత్ర బృందం తెలిపింది. సినిమాలో మొగల్ చక్రవర్తుల కాలం నాటి నేపథ్యం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. ఇక నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు ఇందులో భాగమవుతున్నారు.