INDIA TARGET 244 IN 3RD ODI
- మూడో వన్డేలోనూ విజృంభించిన భారత బౌలర్లు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలోనూ భారత బాలర్లు విజృంభించడంతో కివీస్ జట్టు 243 పరుగులకు ఆలౌట్ అయింది. రాస్ టేలర్(93), టామ్ లాథమ్(51) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 26 పరుగులకే మున్రో(7), గప్టిల్(13) వికెట్లను కోల్పోయింది. తర్వాత విలియమ్సన్(28) పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో టేలర్-లాథమ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్ తేరుకుంది. ఈ క్రమంలోనే ముందుగా టేలర్ హాఫ్ సెంచరీ చేయగా, లాథమ్ కూడా అర్థ శతకంతో మెరిశాడు. హాఫ్ సెంచరీ సాధించిన లాథమ్ స్కోరును పెంచే క్రమంలో ఔటయ్యాడు. కాసేపటికి హెన్రీ నికోలస్, సాంత్నార్‌లు ఔటయ్యారు. దాంతో కివీస్ 20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతుండటంతో స్కోరును పెంచే బాధ్యత టేలర్‌పై పడింది. అయితే, షమీ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఏడో వికెట్ గా టేలర్ వెనుతిరిగాడు. తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు వరుసపెట్టి పెవిలియన్ కు క్యూ కట్టడంతో 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా.. హార్దిక్ పాండ్యా, చహల్, భువనేశ్వర్ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు.