మూడు రాజధానులు.. మంచిదేనా?

3 CAPITALS FOR AP

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావచ్చేమో అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చంటూ ఆయన చేసిన ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏపీలో సౌతాఫ్రికా మోడల్ అమలు చేసే యోచన ఉందని, దీనిపై వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందని, అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటామని జగన్ స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన జరిగి ఐదున్నరేళ్లు పూర్తయినప్పటికీ, రాజధానిపై స్పష్టత లేని తరుణంలో జగన్ తాజా ప్రకటననపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, పరిపాలనా వికేంద్రీకరణతోనే ఇది సాధ్యమని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతుండగా.. ఇది తుగ్లక్ నిర్ణయమని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా జగన్ పాలన ఉందని, ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియడంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇవన్నీ తుగ్లక్ నిర్ణయాలని దుయ్యబట్టారు. మూడు రాజధానులు ఉంటే, సీఎం ఎక్కడ కూర్చుంటారని ప్రశ్నించారు. దీనివల్ల ప్రాంతీయ విభేదాలు ప్రబలుతాయని హెచ్చరించారు. వాస్తవానికి పరిపాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి ఫలాలు సమానంగా అందుతాయి. కానీ ఆచరణలో ఇది కాస్త కష్టం అనే అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే చేయడం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అంతగా అభివృద్ది చెందలేదని.. ఫలితంగానే విభజన సమయంలో హైదరాబాద్ ను వదులుకోవడానికి రెండు ప్రాంతాల ప్రజలూ అంగీకరించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే పరిపాలనా వికేంద్రీకరణ అమలు చేయాల్సిందేనని పేర్కొంటున్నారు. మొత్తానికి రాజధానిపై మరోసారి రగడ ప్రారంభమైంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article