30 మందికి మొండిచేయేనా?

30 SITTINGS WILL NOT GET TDP TICKETS

  • టీడీపీ సిట్టింగులపై వేలాడుతున్న కత్తి
  • పనితీరు బాలేదంటూ చంద్రబాబు క్లాస్
  • ఇలా అయితే టికెట్ ఇవ్వలేనని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన కసరత్తు షురూ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తానని ఇటీవల ప్రకటించిన బాబు.. ఆ దిశగా ముందుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం ద్వారా అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న ఆయన.. అందుకు తగినట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు గ్యారెంటీయో బేరీజు వేసుకుంటున్నారు. నియోజకవర్గాలవారీగా ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన చంద్రబాబు.. ఆ నివేదికతోపాటు ఇతరత్రా మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో టీడీపీపై వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకు నివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా ప్రజా వ్యతిరేకతను తగ్గించుకుని మళ్లీ ఓట్లు పొందాలని బాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేతో ఆయన సమావేశం అవుతున్నారు. ఒకవేళ ఒక ఎమ్మెల్యేకు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ మార్కులు బాగా తక్కువుగా వచ్చి ఉంటే.. పార్టీ టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అలాగే కాస్త అటు ఇటుగా మార్కులు వచ్చినవారికి మాత్రం వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నాలుగు నెలలు నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజల ఆదరణ చూరగొనాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన వివరాల మేరకు కనీసం 30 మంది సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్క అవకాశాలు మృగ్యమేనని అంటున్నారు. ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెబుతున్న చంద్రబాబు.. ఎన్నికల సమయంలో వారి నుంచి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు కూడా చేపడుతున్నారు. ప్రత్యామ్నాయ పదవులు ఇస్తామనో, మీ జాతకం నా దగ్గర ఉంది జాగ్రత్తగా ఉండాలనో పేర్కొంటూ వారిని దారికి తెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి మొండిచేయి తప్పదని అంటున్నారు. మరోవైపు గత ఎన్నికల అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగిపోయి వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసినవారిలో అత్యధికులకు కూడా టికెట్ లభించే పరిస్థితి లేదని సమాచారం.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article