33 DISTRICTS TELANGANA
తెలంగాణ ముఖచిత్రం మరోసారి మారింది. రాష్ట్రంలో ములుగు, నారాయణపేట రెవెన్యూ డివిజన్లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు 31 జిల్లాలున్న తెలంగాణ.. తాజాగా 33 జిల్లాల తెలంగాణ సంతరించుకుంది. గతేడాది డిసెంబర్ 31న ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు ముసాయిదా ప్రకటనను జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను కోరింది. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు, మహబూబ్నగర్ జిల్లా నుంచి నారాయణపేటలను వేరు చేస్తూ శనివారం తుది ప్రకటన విడుదల చేసింది. పది జిల్లాలతో ఆవిర్భవించిన తెలంగాణలో 2016 అక్టోబర్ 11న కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు. తాజాగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు. ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఆదివారం నుంచే పాలనాపరమైన సేవలు ప్రారంభం కానున్నాయి. కొత్త జిల్లాల ఆవిర్భావం, మనుగడ 17.02.2019 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేర్కొన్నారు. తొమ్మిది మండలాలతో ఏర్పడిన ములుగు జిల్లాలో ములుగు కేంద్రంగా పరిపాలన కొనసాగనుంది. 11 మండలాలతో ఏర్పడిన నారాయణపేట జిల్లా నారాయణపేట కేంద్రంగా పరిపాలన కొనసాగనుంది.
నారాయణపేట మండలాలివే…
నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఊట్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా.
ములుగు మండలాలివే…
ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, సమ్మక్క-సారక్క తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు.