36 floors.. 3.6k per sft
ఔనా.. నిజమేనా?
కోకాపేట్లో 36 అంతస్తుల ఆకాశహర్మ్యం.. జీహెచ్ఎంసీ, రెరా అనుమతి లేదు.. మొత్తం 14 ఎకరాలు.. మొదటి విడతలో 3.6 ఎకరాలు.. ఫ్లాటు ధర చదరపు అడుక్కీ రూ.3,600 మాత్రమే.. ఆలస్యం చేసినా ఆశాభంగం..
ఇలాంటి ప్రీ లాంచ్ ప్రాజెక్టులు హైదరాబాద్లో కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి.ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి పేజీల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ, రెరా అనుమతి తీసుకోకుండా.. కేవలం బ్రోచర్లను ముద్రించి.. తక్కువ రేటంటూ కొందరు బిల్డర్లు ఇష్టం వచ్చినట్లు విక్రయిస్తున్నారు. ఈ నిర్మాణాలన్నీ కాగితాల మీద కనిపిస్తున్నాయే తప్ప నిర్మాణ పనులు ప్రారంభమైన దాఖలాలు కనిపించట్లేదు. కోకాపేట్ వంటి ఏరియాలో.. వంద శాతం సొమ్ము కడితే కేవలం రూ. 36 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్ లభిస్తుంటే కొనుగోలుదారులూ వెనకా ముందు చూడకుండా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సంస్థ చేస్తున్న ప్రచారం ప్రకారం.. ఇందులో మొత్తం 430 ఫ్లాట్లను నిర్మిస్తారట.
* కాస్త లగ్జరీగా 36 అంతస్తులు కట్టాలంటే చదరపు అడుక్కీ ఎంతలేదన్నా రూ.3,000 పైగానే ఖర్చవుతుంది. అందుకే, పలు నిర్మాణ సంస్థలు ప్రస్తుతం కోకాపేట్లో చదరపు అడుక్కీ రూ.7,000కు అటుఇటుగా విక్రయిస్తున్నాయి. కానీ, ఇలాంటి సంస్థలేమో చదరపు అడుక్కీ రూ.3,600కే అమ్ముతామంటూ ముందుకొస్తున్నాయి. ఇప్పటివరకూ స్కై స్క్రాపర్లు కట్టడంలో అనుభవం లేని సంస్థలే ఎక్కువగా ఇలాంటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్థానిక సంస్థలు, రెరా వద్ద అనుమతి తీసుకోకుండానే కొందరు డెవలపర్లు గాల్లోనే మేడలు కట్టేస్తూ విక్రయిస్తున్నారు. మరి, ఈ గాలి మేడలుంటాయా? లేదా? అని కాలమే నిర్ణయిస్తుంది.