కాపులకు సగం ఇచ్చేద్దాం

5 PERCENT EBC QUOTA TO KAPUS

  • ఈబీసీ కోటాలో 5 శాతం కాపులకు కేటాయింపు
  • ఇతర అన్ని అగ్రవర్ణాల పేదలకు 5 శాతం
  • ఏపీ కేబినెట్ నిర్ణయం

అసెంబ్లీ ఎన్నికలకు ఇంక ఎంతో సమయం లేనందున కీలక వర్గాలను ఆకట్టుకునే దిశగా తెలుగుదేశం పార్టీ కసరత్తు షూరూ చేసింది. ఈ నాలుగున్నరేళ్లలో ఆశించినంత అభివృద్ధి లేకపోవడం.. రాజధాని అమరావతిలో కూడా ఒక్క శాశ్వత నిర్మాణమూ పూర్తి కాకపోవడం.. రైతులు, నిరుద్యోగులు సహా దాదాపు అన్ని వర్గాల్లోనూ గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్ టీడీపీ ప్రభుత్వం.. తాజాగా కాపులను ఆకట్టుకునేందుకు వారికి 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేంద్రం ప్రకటించిన 10 శాతం ఈబీసీ కోటాలో 5 శాతం కాపులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన 5 శాతం కోటాను ఇతర అన్ని అగ్రవర్ణాల పేదలకు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  ఈ సందర్భంగా పలు వర్గాలవారిపై వరాల జల్లు కురిపించారు.

రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న లక్షా 26వేల పేదల ఇళ్లకు రూ.756 కోట్లు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. 1996 -2004 మధ్య కాలంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు రూ.10వేలు ఇచ్చేందుకు సమ్మతి తెలిపింది. ట్రాక్టర్లు, ఆటో రిక్షాలకు జీవితకాలం పన్ను మినహాయింపును మంత్రివర్గం ఆమోదించింది. ఐటీ పాలసీ కింద ఇచ్చే రాయితీల ప్రోత్సాహకానికి ఆమోదముద్ర వేసింది. చేనేతకార్మికులకు ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం క్యాపిటల్‌ హౌసింగ్‌ ప్రమోషన్‌ పాలసీని రూపొందించాలని,  చట్టంలో నిబంధనలు పొందుపరచాలని సీఆర్డీయే అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధానిలో జర్నలిస్టు సొసైటీకి 25 ఎకరాలు కేటాయింపునకు మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడం కోసం ముందుగా రూ.250 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం అందించే విషయంపైనా చర్చించారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహా పథకాన్నే తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

AP POLITCS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article