Sunday, September 29, 2024

అడవుల సంరక్షణకు అరుదైన ఒప్పందం 

  • కర్ణాటకతో కలిసి భవిష్యత్తులోనూ ముందుకు వెళ్తాం
  • ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాల మధ్య జరిగిన ఎంఓయూ చారిత్మాత్మకం
  • కుంకీ ఏనుగులు, సమాచార మార్పిడి, గిరిజనుల శిక్షణ, స్మగ్లర్లపై నిఘా, ఎకో టూరిజం, ప్రత్యేక టాస్క్ ఫోర్సుల ఏర్పాటు
  • రెండు విభిన్న ప్రభుత్వాలు మధ్య కీలక ఒప్పందం
  • సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు
  • కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కర్ణాటక అటవీశాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే గారు
  • ఎంఓయూల మార్పిడి అనంతరం ప్రసంగించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే గారు

సమగ్ర అధ్యయనం, విజ్ఞానం, సహకారంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అటవీ శాఖలు భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడూ లేని విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య అడవుల పరిరక్షణ, వన్య ప్రాణులన సంరక్షణ, గిరిజనులకు శిక్షణ, సమాచార మార్పిడి, ఏనుగుల సమస్య, ఎకో టూరిజం వంటి కీలకమైన అంశాల పట్ల మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంయూఓ) కుదిరింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి.ఖండ్రే గార్ల సమక్షంలో ఎంయూఓ కుదిరింది. విజయవాడలో శుక్రవారం ఓ హోటల్ లో జరిగిన అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశంలో ఇరు రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేసి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 6 కీలకమైన అంశాల్లో ఈ సమన్వయం నిరంతరాయంగా రెండు రాష్ట్రాల మధ్య సాగనుంది.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘చిత్తూరు జిల్లాకు వివిధ సందర్బాల్లో వెళ్లినపుడు అక్కడ ప్రజలు ఏనుగుల గుంపులు పంట పొలాల మీద పడుతున్నాయని, ఆస్తి నష్టంతో పాటు ప్రాణాలు పోతున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని చెప్పారు. ఇది కేవలం చిత్తూరు జిల్లాలో కాకుండా, రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా సమస్య ఉంది. నేను అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రజలకు సంబంధించిన ఈ ఏనుగుల సమస్యను ఎలా అధిగమించాలని అధికారుల సమీక్ష సమావేశంలో అడిగాను. దీనికి వారు ఏనుగుల గుంపులను కంట్రోల్ చేయాలంటే కర్ణాటక వద్ద శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల వల్లనే సాధ్యమని చెప్పారు. వెంటనే కర్ణాటక అటవీశాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి.ఖండ్రే గారితో మాట్లాడితే ఆయన మరో మాట లేకుండా సహకరిస్తామని హామీ ఇచ్చి, రెండు రోజుల్లోనే సమావేశం ఏర్పాటుకు ముందుకు వచ్చారు. దీంతో బెంగళూరుకు వెళ్లి అక్కడ సమావేశంలో పాల్గొన్నాను. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారితోనూ చర్చిస్తే సానుకూలంగా స్పందించారు. ఈ సమయంలో అక్కడ అధికారులు చెప్పిన విషయాలు, వారి ఆతిథ్యం, సహకారం నన్ను ఆకట్టుకున్నాయి. కేవలం ఏనుగుల కోసమే కాకుండా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన అంశాలపై పరస్పర సహకారం అవసరం అని చెప్పడంతోపాటు, ఇతర అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించి రెండు రాష్ట్రాలు దీనిపై ఎంఓయూ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పారు.

నాకు చిన్నప్పటి నుంచి కన్నడ భాష అంటే విపరీతమైన ప్రేమ. కన్నడ కంఠీరవ శ్రీ రాజ్ కుమార్ గంధద గుడి సినిమాలో అడవుల రక్షణ కోసం ఆయన చూపించే హీరోయిజo ఆకట్టుకుంది. ఇప్పుడు రాష్ట్రం కోసం అటవీశాఖ తరఫున పక్క రాష్ట్రంతో ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉంది.

* శాఖాపరంగా అన్ని విషయాల్లోనూ కలిసి ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ కు ఎర్రచందనం స్మగ్లర్ల సమస్య ఉన్నట్లే, కర్ణాటకకు శ్రీగంధం చెట్ల కొట్టివేత సమస్య అధికంగా ఉంది. దీంతోపాటు పరిజ్ఞానం, పరస్పర సహకారం, సిబ్బందితో కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్సుల ఏర్పాటు, వన్య ప్రాణుల సంరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి, గిరిజనులకు ప్రత్యేక శిక్షణ వంటి కీలకమైన అంశాలపై రెండు రాష్ట్రాలు కలిసి పని చేయనున్నాయి. పరస్పరం సహకరించుకుంటూ, అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. దీనివల్ల చాలా సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత అడవుల్లో జరిగే అసాంఘిక శక్తులను అరికట్టవచ్చు. కుంకీ ఏనుగులను కర్ణాటక మనకు ఇవ్వడమే కాకుండా శిక్షణ కోసం మావటీలను పంపనుంది. రాష్ట్రంలో కుంకీ ఏనుగుల శిక్షణకు ప్రత్యేకంగా ఓ శిబిరం ఏర్పాటు చేయనుంది. మేం అడిగిన వెంటనే ఏనుగులను ఇవ్వడానికి ఒప్పుకోవడమే కాకుండా, అన్ని విధాలా సహకారం అందించడానికి ముందుకు వచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి గారి మార్గదర్శకంలో అటవీశాఖ అభివృద్దిలో మరింత ముందుకు వెళ్లనున్నాం’’ అన్నారు.

  • శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించగానే కుంకీ ఏనుగులు ఇవ్వాలని నిర్ణయించాము: శ్రీ ఈశ్వర్ బి.ఖండ్రే, అటవీశాఖ మంత్రి, కర్ణాటక ప్రభుత్వం

‘గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెను శాపంగా మారుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ఈ సమయంలో అంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. విజ్ఞాన మార్పిడి, సమాచార పెంపు, సిబ్బంది శిక్షణ, గిరిజనులకు బతుకుదెరువు, స్మగ్లర్ల ఆటకట్టించే విషయాల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు ఈ ఎంయూఓ మార్గం చూపిస్తుంది. ఎలాంటి అరమరికలు లేకుండా రెండు రాష్ట్రాలు ఏకంగా సమస్యలను ఎదుర్కొని అడవుల పరిరక్షణకు ముందుకు కదులుతాయి. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటగా ప్రజలు ఎదుర్కొనే ఏనుగుల బాధ గురించి మాతో మాట్లాడటం, మేం చెప్పిన 48 గంటల్లోనే బెంగళూరుకు వచ్చి సమావేశంలో పాల్గొనడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఆయన ప్రజల గురించి ఆలోచించే మనిషి అని అర్థమైంది. అందుకే ఆయన అడిగిన వెంటనే కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడానికి సిద్ధం అయ్యాం. రానున్న రోజుల్లో అడవుల పరిరక్షణ, వన్య ప్రాణుల రక్షణ అనేది కీలకం కానుంది. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన 6 కీలకమైన ఒప్పందాలు భవిష్యత్తులో ప్రయోజనకరం అవుతాయని బలంగా నమ్ముతున్నాను. ఈ ఒప్పందాన్ని పై స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు తగిన విధంగా అమలు అయ్యేలా పనిచేస్తారని ఆశిస్తున్నాను.

కర్ణాటకలో 32 ఎకో టూరిజం పార్కులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కూడా వాటిని పెంచేలా చూస్తాం. ఎర్రచందనం, శ్రీగంధం స్మగ్లర్ల ఆటకట్టించేలా రెండు రాష్ట్రాలు పని చేయనున్నాయి’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అనంతరాము, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, హెచ్ ఓ ఎఫ్ ఎఫ్ శ్రీ చిరంజీవ్ చౌదరి, కర్ణాటక అటవీశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ శ్రీ మంజునాథ్ ప్రసాద్, కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ బ్రిజేష్ కుమార్ దీక్షిత్, ఏపీ వైల్డ్ లైఫ్ విభాగం చీఫ్ కన్జర్వేటర్ శ్రీ ఏకే నాయక్, కర్ణాటక  వైల్డ్ లైఫ్ కన్జర్వేటర్ శ్రీ సుభాష్ ముల్కే తదితరులు పాల్గొన్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular