ACB Catches the Corrupted Employee .. అక్రమాస్తులు 40కోట్లు
ఏపీలో ఒక భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలలో పడింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, అవినీతి చేశారని అందిన సమాచారంతో దాడులు చేసిన అధికారులకు ఆయన ఆస్తులు చూసి కళ్ళు తిరిగినంత పనయ్యింది.
ఆభరణాలు, ఆస్తులు చూసి..దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఏసీబీ చరిత్రలో మొదటి సారిగా బ్యాంక్ లాకర్ల నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు అధికారిని అరెస్ట్ చేసి, ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చే అసలు జీతం కంటే లంచంతో వచ్చే కొసరుకే ఆశపడుతున్నారు కొందరు అవినీతి అధికారులు. ఈ జాబితాలోకి చేరాడు విశాఖ మైన్స్ అండ్ జియాలజీ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ గోండు శివాజీ. ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారన్న సమాచారంతో.. ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఏకకాలంలో ఏడు చోట్ల.. జనవరి 31వ తేదీ గురువారం తెల్లవారుజాము నుండి సోదాలు జరిగాయి. పలు కీలక పత్రాలతో పాటు సుమారు కోటి రుపాయలు నగదు 1759గ్రాముల బంగారం గుర్తించారు. శివాజీ ఆస్తుల విలువ బహిరంగా మార్కెట్‌లో 40 కోట్లకు పెగా ఉంటుందని ప్రాథమికంగా అంచనావేశారు.విశాఖ, ఎంవిపి కాలనీ లోని శివాజీ ఇంటి నుంచి 10 లక్షల నగదు, 400 గ్రాములు బంగారం, ఎంవీపీ ఎస్‌బీఐ బ్యాంక్ లాకర్ లో 39 లక్షల 50వేల నగదు, మువ్వలపాలెం బ్రాంచ్ లో రెండు లాకర్లు,1359 గ్రాముల బంగారం, అదే బ్రాంచ్‌లోని రెండో లాకర్‌లో 34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా ఎంవిపి కాలనిలో జీ ఫ్లస్ 3, బోగాపురంలో జి+2 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు కాపులుప్పాడలో 22సెంట్లు, సొంత ఉరులో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు ఓ బైక్ సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లాకర్లలో దాదాపు కోటి రూపాయల నగదు దొరకడం ఇదే మొదటిసారని ఏసీబీ అధికారులు తెలిపారు.