అదనపు కలెక్టర్లు అంతగా పని చేస్తలేరు

‘‘అదనపు కలెక్టర్లను నియమించుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యం, పల్లెలు పట్టణాలను బాగు చేసుకుందానికే. వారు నిరంతరం క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉండాలి. డీపీవోలు సహా కింది స్థాయి ఉద్యోగులను ఆ దిశగా ఉత్సాహపరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. కానీ అదనపు కలెక్టర్లు అనుకున్న రీతిలో తమ పని సామర్ధ్యాన్ని నిరూపించుకోవడం లేదు. వారి నుంచి నీను చానా ఆశించిన. కానీ అనుకున్నంత స్థాయికి వారి పనితీరు చేరుకుంటలేదు. కేవలం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, మున్సిపల్ మంత్రులు మాత్రమే అన్నీ చేయాలంటే కాదు. ఏ జిల్ల లో ఆ జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ… పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములు కావాలె. ప్రజలను చైతన్యపరిచి వారిని మరింతగా భాగస్వాములను చేయాలె ’’ అని సిఎం వివరించారు.

ఈ నేపథ్యంలో… జూన్ 13 న ప్రగతి భవన్ లో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కోసం చేపడుతున్న కార్యాచరణ, వారి పనితీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సిఎం తెలిపారు. ‘‘ ప్రతి సీజన్లో కొన్ని ప్రత్యేక వ్యాధులు ప్రబలుతుండడం సహజం . వానాకాలం వస్తే మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు, చలికాలంలో స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు, ఎండాకాలంలో డయేరియా వంటి వ్యాధులు వస్తుంటయి. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులను ముందస్తుగానే గుర్తించి అరికట్టడం అతి ముఖ్యం. ఇందుకు గాను.. పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, హెల్త్ డిపార్ట్ మెంట్ మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాలి’’ అని సిఎం సంబంధిత మంత్రులకు, అధికారులకు సూచించారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో.. ట్యాంకులను శుధ్దిచేసి తాగునీరును అందిచాలన్నారు. కరోనా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎఎన్ఎం, ఆశా వర్కర్లు సహా వైద్యారోగ్యశాఖ ఉద్యోగులను సమాయత్తపరచాలని వారిని ముందస్తుగానే ప్రతీ సీజన్ లో సీజనల్ వ్యాధులను నివారించే చర్యలకు సిద్దం చేయాలన్నారు.

అభివృద్ది కండ్లకు కనిపించినప్పుడే ప్రజలు ప్రజాప్రతినిధులు వెంట నడుస్తారని ఆ దిశగా ఇప్పటికే విజయం సాధించిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలోనే ఉత్తమమైనవిగా గుర్తించబడినాయని, ఈనేపథ్యంలో అలసత్వం వదిలి మరింత పట్టుదలతో పనిచేసి తెలంగాణను అద్దంలా తీర్చిదిద్దుకోవాలని సిఎం అధికారులకు స్పష్టం చేశారు. ‘‘ఇకనుంచి మున్సిపల్ డైరెక్టరు పంచాయతీరాజ్ కమిషనర్లు జిల్లాలు, గ్రామాల పర్యటన చేపట్టాలని,వారు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పల్లెలు, పట్టణాల ప్రగతి తీరును పరిశీలించాలన్నారు. డీపీవోలను కూడా పల్లెల పర్యటనల్లో నిమగ్నం చేయాలని సిఎం స్పష్టం చేశారు. గ్రామాలు,మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే అవుట్లు యధావిధిగా కొనసాగుతున్నట్టు తనకు సమాచారం వుందని వాటిగురించి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు మున్సిపాలిటీల బడ్జెట్ తయారీలో భాగస్వాములు కావాలని చెప్పామని ఏ మేరకు అవుతున్నారని సిఎం ఆరా తీసారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article