AIBB SHOCK TO AP SARKAR ON AMARAVATHI
ఏపీ సర్కార్ కు రాజధాని విషయంలో మరో షాక్ తగిలింది. రాజధాని నిర్మాణం కోసం వేల కోట్ల రుణం కావాలంటూ, ఇందుకు సహకరించాలని వరల్డ్ బ్యాంక్‌ని ఏపీ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. అయితే అంత భారాన్ని మోయడం తమ వల్ల కాదంటూ ప్రపంచ బ్యాంకు చేతులెత్తేసి ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది. ఇదే బాటలో మరో బ్యాంకు కూడా చేతులెత్తేసి అమరావతికి ఆర్థిక సహాయం చేయలేం అంటూ షాకిచ్చింది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన షాక్ నుంచి ఏపీ ప్రభుత్వం తేరుకునే లోపే మరో కీలక బ్యాంకు అమరావతి అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయలేమంటూ చేతులెత్తేయడం సంచలనంగా మారింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్(ఏఐఐబీ) అమరావతికి రుణం ఇవ్వలేమంటూ తాజాగా స్పష్టం చేసింది.
దీంతో అమరావతి అభవృద్ధి అన్నది ప్రశ్నార్థకంలో పడిపోయింది. తొలుత వరల్డ్ బ్యాంక్ .. ఇప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్(ఏఐఐబీ) అమరావతి అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయలేమంటూ వెనక్కి తగ్గడం తో రాజధాని నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. అమరావతి నిర్మాణం కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ 200 మిలియన్ డాలర్ల అప్పును ఇవ్వడానికి ఆసక్తిని చూపించింది. అందుకు సంబంధించిన ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బ్యాంకు డైరెక్టర్లు వెనక్కుతగ్గాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అమరావతి అభివృద్ధి కోసం రుణాలు ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేసిన పలు బ్యాంకులన్నీ ఒక్కొక్కటిగా ఇంటి బాట పట్టడం. రుణాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేయడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఒత్తడి మొదలవుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ అనుబంధ మీడియా రచ్చ చేస్తుండటం పాలక పక్షానికి సంకటంగా పరిణమిస్తోంది. ఇలా అమరావతి అభివృద్ధి నుంచి ఒక్కో బ్యాంకు చేతులెత్తేస్తుంటే సీఎం జగన్ ఎలాంటి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీంతో వైసీపీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి.