Al Qaeda Terrorist Badawi Died
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్
అల్ ఖైదాకు చెందిన ఉగ్రవాది జమాల్ అల్ బదావీని తమ భద్రతా దళాలు మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ‘యూఎస్ఎస్ కోల్ పై దాడి ఘటనకు సంబంధించిన కీలక వ్యూహకర్తల్లో ఒకరిని మట్టుబెట్టడం ద్వారా మా గొప్ప మిలటరీ.. నాటి దాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన మా హీరోలకు న్యాయం చేసింది. మేం కేవలం ఆ దాడికి సంబంధించిన నాయకుడు జమాల్ అల్ బదావీని మాత్రమే అంతమొందించాం. ఉగ్రవాదంపై మా పోరును ఎప్పటికీ ఆపేది లేదు’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. యెమెన్ లో అమెరికా దళాలు చేపట్టిన వైమానిక దాడిలో బదావీ హతమైనట్టు భావిస్తున్నారు. 2000 అక్టోబర్ 12న అమెరికాకు చెందిన యూఎస్ఎస్ కోల్ అనే నౌక యెమెన్ లో ఇంధనం నింపుకోవడం కోసం ఆగినప్పుడు దానిపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో 17 మంది అమెరికా సైనికులతోపాటు దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా.. 39 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని అల్ ఖైదా ప్రకటించింది. అనంతరం 2003లో యెమెన్ దళాలు బదావీని పట్టుకున్నప్పటికీ.. అతడు తప్పించుకున్నాడు. అప్పటినుంచి అతడి కోసం అమెరికా వేటాడుతోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో బదావీ పేరు ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 1న బదావీ లక్ష్యంగా జరిపిన వైమానిక దాడిలో అతడు మరిణించినట్టు అమెరికా దళాలు వెల్లడించాయి.