Alok verma Resigned before retirement
- పదవీ విరమణకు ముందే రాజీనామా
- మోదీ నిర్ణయంతో మనస్తాపంతో నిర్ణయం
శాలరీ ఇచ్చేవాడిపై సెటైర్ వేస్తే.. రిటైరైపోతారు అనేది ఓ సినిమాలో పేలిన డైలాగ్. సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ.. ఎలాంటి సెటైర్ వేయకపోయినా రిటైర్ కావాల్సి వచ్చింది. ఈనెలాఖరు వరకు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ, అనూహ్యంగా ముందే రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని మోదీ సర్కారుతో పోరాటం ఆయన పదవికే ఎసరు తెచ్చింది. తనను నిర్బంద సెలవుపై పంపిన మోడీ సర్కారుతో ఆలోక్ వర్మ ఫైట్ చేయటం తెలిసిందే. సుప్రీంకోర్టును ఆశ్రయించి.. న్యాయపోరాటంలో గెలిచిన ఆయన తనను ఖాళీ చేయించిన కుర్చీలోకి వచ్చి మళ్లీ కూర్చున్నారు. వచ్చీ రావడంతో కొంతమంది అధికారులను బదిలీ కూడా చేశారు. అయితే, కోర్టులో ఓడిపోయిన ప్రధాని మోదీకి ఇది ఎంతమాత్రం నచ్చలేదు. వెంటనే పావులు కదిపారు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే హైపవర్ కమిటీ సమావేశం ఏర్పాటుచేసి ఆలోక్ వర్మను బదిలీ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన వర్మ.. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి అగ్నిమాపక విభాగం డీజీగా బదిలీ చేసిన మోడీ సర్కారు నిర్ణయంపై అసంతృప్తితో ఉద్యోగానికే రాజీనామా చేశారు. తాను 2017 జులైలోనే రిటైర్ అయ్యానని.. దాంతో సంబంధం లేకుండానే తనకు సీబీఐ డైరెక్టర్ పదవికి రెండేళ్ల పాటు ఎంపిక చేసిన వైనాన్ని గుర్తు చేశారు. వర్మను సాగనంపిన మోడీ ప్రభుత్వమే ఆయన్ను ఏరికోరి మరీ సీబీఐ డైరెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టింది. అయితే వారికి నచ్చినట్లుగా ఆయన పని చేయకపోవటంతో వేటు పడక తప్పలేదు