అమరావతి స్పెషల్‌ అగ్రికల్చర్‌ జోన్‌ ? వాళ్లు ఒప్పుకుంటారా ?

156
Amaravati to be Agriculture Zone?
Amaravati to be Agriculture Zone?

Amaravati to be Agriculture Zone?

ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతాన్ని స్పెషల్‌ అగ్రికల్చర్‌ జోన్‌ చేసేందుకు సర్కార్‌ ఆలోచన చేస్తుందా..? సారవంతమైన ఆ భూముల్లో మళ్లీ నాగళ్లను దింపడం ద్వారా అమరావతి ప్రాంతాన్ని అగ్రికల్చర్‌ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. ప్రభుత్వ పెద్దల కామెంట్లు చూస్తుంటే ఇదే నిజమనిస్తోంది. ల్యాండ్‌ పూలింగ్‌కు భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వం.. సాగుకు సౌకర్యం కల్పిస్తాంటూ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో చర్చనీయాంశంగా మారాయి.

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పటి నుంచి రాజధాని ప్రాంత రైతులు వారి వారి ఇళ్లల్లో కంటే రోడ్ల మీదే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి నిత్యం ఆందోళనలు.. ధర్నాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులతోపాటు.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను అమల్లో పెట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లిపోతున్న పరిస్థితి కన్పిస్తోంది. ఈ క్రమంలో మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తన పని కానిచ్చేసుకోవడానికి సాంకేతిక.. న్యాయపరమైన అడ్డంకులు అధిగమించడానికి ఓ పక్కన కసరత్తు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో అమరావతి రైతులకు సర్కార్‌ ఏ విధమైన న్యాయం చేయబోతోంది. రైతులకు భూమిని తిరిగి ఇచ్చేస్తామంటూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే మంత్రి పెద్దిరెడ్డి చేసే కామెంట్ల వెనుకున్న అసలు మర్మం ఏమిటీ..? నిజ్జంగానే ఆ భూమిని తిరిగి ఇచ్చేస్తారా..? లేక ప్రత్యామ్నాయ మార్గాలను సర్కార్‌ అన్వేషిస్తుందా..? అనే చర్చ జోరుగా జరుగుతోంది.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజధాని అమరావతి నగర నిర్మాణం కోసం ల్యాండ్‌ పూలింగ్‌ ఇచ్చిన భూములతోపాటు.. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుని స్పెషల్‌ అగ్రికల్చర్‌ జోన్‌ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిపుణుల నుంచి కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకే నివేదిక రూపోందించినట్టు సమాచారం. రాష్ట్రంలోని  ప్రత్యేక ఆర్ధిక మండళ్ల పురోగతిని పరిశీలించిన అనంతరం ఈ నివేదిక రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. వాణిజ్య పరంగా అత్యంత విలువైన పంటలకు హబ్‌గా అమరావతిలోని 33 వేల ఎకరాలను మార్చాలన్నది ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నట్టు సమాచారం. అలాగే సమీకృత వ్యవసాయ అభివృద్ధికి ఈ ప్రాంతం చారిత్రకంగానూ ప్రసిద్ధి అనే విషయాన్ని నిపుణులు ఈ నివేదికలో పేర్కోన్నట్టు సమాచారం. స్పెషల్ అగ్రికల్చర్ జోన్‌కు రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్ని అందించే అవకాశముందని నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అధునాతన వ్యవసాయ విధానాలైన వర్టికల్ ఫార్మింగ్, హైడ్రోఫోనిక్స్, ఆర్గానిక్ వ్యవసాయం, వాణిజ్య, ఉద్యాన పంటలు, ఔషధాలు, సుగంధ, లేపనాల సాగు, పశుగణాభివృద్ధి చేపట్టే అవకాశముందని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఇక వ్యవసాయక్షేత్రాల నుంచే నేరుగా వినియోగదారునికి సరఫరా చేసేలా ఇ-మార్కెట్ కు అనుసంధానించే అవకాశముందని సదురు నివేదికలో పేర్కోన్నట్టు సమాచారం. ఇక ఉత్పత్తుల వారీగా సామూహిక వ్యవసాయ విధానాలతో పాటు ఫార్మర్ ప్రోడ్యూసర్స్ ఆర్గనైజేషన్, సహకార వ్యవస్థ ద్వారా విక్రయాలనూ చేపట్టే అవకాశం ఉందని నివేదికలో పేర్కోన్నారు నిపుణులు.
విశాలమైన వ్యవసాయ క్షేత్రంగా అమరావతిని అభివృద్ధి చేసే అవకాశం ఉండటంతో ఎక్స్‌పోర్ట్ జోన్‌గానూ మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో స్పెషల్ అగ్రికల్చర్ జోన్ ఓ ఆదర్శ విధానంగా, బెంచ్ మార్క్‌గా ఉంటుందనే భావనను కూడా సదురు నివేదికను రూపొందించిన నిపుణులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఈ
స్పెషల్ అగ్రికల్చర్ జోన్‌లో రైతులనూ భాగస్వాములుగా చేసి ఆర్ధిక స్వావలంబన సాధించే అవకాశముందని నివేదికలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. స్పెషల్‌ అగ్రికల్చర్‌ జోన్‌కు అనుబంధంగా ఇతర ఆహారశుద్ధి పరిశ్రమలూ అభివృద్ధి చెందుతాయని నివేదికలో స్పష్టం చేసినట్టు అధికారిక వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఆహార భద్రతా సవాళ్లకు విరుగుడుగా ఈ స్పెషల్ అగ్రికల్చర్ జోన్ మారుతుందని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ.. దీనికి రైతులు ఏ మేరకు అంగీకరిస్తారోననేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం రాజధాని రైతులు తమ పోరాటాన్ని కేవలం తమ భూముల కోసం కాకుండా.. పూర్తి స్థాయి రాజధానిని అమరావతిలోనే ఉంచాలనే దిశగా ఆందోళనను ముమ్మరం చేస్తున్న క్రమంలో ఈ ప్రతిపాదనను రైతుల ముందు ఉంచాలా..? ఉంచితే ఏ విధంగా ఉంచాలి..? అసలు ఈ ప్రతిపాదనపై ఆలోచన చేయడానికైనా రైతులు సిద్దంగా ఉంటారా..? లేదా..? అనే మీమాంసలో సర్కార్‌ పెద్దలు ఉన్నారు. దీంతో ఈ వ్యవహరాన్ని ఇప్పటికిప్పుడే కాకుండా.. కొంచెం సమయం తీసుకుని ఈ ప్రతిపాదనకు కార్యరూపం దాల్చే అంశాన్ని పరిశీలించాలని సర్కార్‌ భావిస్తోంది.

Amaravati to be Agriculture Zone?,AP, YCP, CM Jagan, jagan mohan reddy , capital issue , agriculture zone, capital farmers, capital amaravati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here