Anand Mahindra tweet On Present Politics
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారాయి . ఇక మహా రాజకీయాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎవరూ ఊహించని విధంగా మహా రాజకీయాలు మారటం అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. తెల్లారితే శివసేన పీఠం ఎక్కుతుంది అని అందరూ భావిస్తే అనూహ్యంగా బీజేపీ అధికారం హస్తగతం చేసుకోవటం చాలా ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు అద్దంపట్టేలా ఓ వీడియోను పోస్టు చేసిన ఆయన ఇంతకంటే బాగా చెప్పలేమని పేర్కొన్నారు.ఆయన షేర్ చేసిన వీడియోలో ఇరు జట్ల మధ్య కబడ్డీ పోటీ జరుగుతోంది. ఓ జట్టు ఆటగాడు కూతకు వచ్చి ప్రత్యర్థి జట్టు ఆటగాడిని అవుట్ చేస్తాడు. వెళ్తూవెళ్తూ మధ్య గీత వద్ద ఆగి ఆటగాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. అవుటైన ఆటగాడు అతడి వద్దకు వచ్చి నిల్చుంటాడు. ధీమాగా నిల్చున్న ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఒక్కసారిగా పట్టుకుని తమవైపు లాక్కుంటాడు.క్షణాల్లోనే అప్రమత్తమైన ఆటగాళ్లు వెంటనే అతడిని కదలకుండా పట్టుకుని పాయింట్ గెలుచుకుంటారు. దీంతో క్షణాల్లోనే ఆట తీరు మారిపోతుంది. పాయింట్ సంపాదించుకున్నట్టు కనిపించిన జట్టు అంతలోనే కోల్పోయింది. ఈ వీడియో మహారాష్ట్ర రాజకీయాలకు అతికినట్టు సరిపోతుందని పేర్కొంటూ ఆనంద్ మహింద్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.