ఏంజిల్ ఇన్వెస్టర్లు ముందుకు రావాలి

28
  • గూగుల్, ఫేస్బుక్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు ఒకప్పడు స్టార్టప్‌లే..
  • స్టార్టప్లతో ఉద్యోగాల కల్పనకు అవకాశం
  • అంకురాలతో భారీ లాభలతోపాటు పేరు ప్రఖ్యాతులూ వస్తాయి..
  • అంకిత‌భావం ఉంటే పెట్టుబడులు అవే వ‌స్తాయి..
  • పెట్టుబడులకు వరంగల్ స్వర్గధామం కాబోతున్నది..
  • వరంగల్ కు చెందిన అమెరికా పారిశ్రామిక వేత్త, ఐఎస్జీ కంపెనీ సీఈవో రవి పులి వెల్లడి
  • టీహబ్ ఏంజిల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ప్రసంగించిన ఎన్నారై రవి పులి

స్టార్టప్ ల‌లో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ర్టంలో ఉన్న పరిస్థితులు గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయని వరంగల్కు చెందిన ఎన్నారై, అమెరికా పారిశ్రామిక వేత్త, ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్ (ఎస్ఎస్జీ) ఫౌండర్ ప్రెసిడెంట్, సీఈవో రవి పులి పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేష‌న్ సెల్‌, టీహబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ( ఇండియన్ టైమ్ 6to 9pm) నిర్వహించిన ఏంజిల్ ఇన్వెస్టర్స్ వ‌రంగ‌ల్ ఎడిష‌న్ ఆన్‌లైన్‌ సదస్సులో ఆయన అమెరికా నుంచి పాల్గొని, తన విలువైన సందేశాన్ని ఇచ్చారు. అంకుర సంస్థ‌ల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు వస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని రవి పులి పేర్కొన్నారు. ఏంజిల్ ఇన్వెస్టర్లు గ్రూపులుగా ఏర్పడి తమకు అవగాహన, కన్విక్షన్ ఉన్న రంగాల్లో పెట్టబడులు పెడితే గొప్ప లాభాలతోపాటు మంచి పేరు ప్రఖ్యాతులు సైతం లభిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు కూడా ఒకప్పుడు స్టార్టప్లేనని పేర్కొన్నారు. వాస్తవానికి రెగ్యులర్ కంపెనీలతో పోలిస్తే స్టార్టప్లే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. యువత ఉద్యోగాల కోసం చూడకుండా పదిమందికీ ఉద్యోగాలు క్పలించే వ్యాపార దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. కంపెనీ పెట్టాలని తొలి రోజుల్లో నా స్నేహితుని ద్వారా రూ.వెయ్యి అందుకున్నానని, అదే తనకు మొదట లభించిన పెట్టుబడి అని రవి పులి వివరించారు. మనం పెట్టే పెట్టుబడి ఎంత అనేది ముఖ్యం కాదని, మనకు ఉన్న దూర దృష్టి, విశ్వాసం, అవగాహన ముఖ్యమని తెలిపారు. విప్రో, ఇన్ఫోసిస్‌, ఫ్లిప్‌కార్ట్ వ్యాపారాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పడు ఎంత‌ పేరు ప్రఖ్యాతులు సంపాదించారో ఆలోచన చేయాలని తెలిపారు. స్టార్టప్ ల‌లో లాభాలు మనం ఊహించని విధంగా ఉంటాయని, పది నుంచి 20 రెట్లు లాభాలు సైతం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. రాబోవు స్టార్టప్ యుగంలో అవకాశాలను అందింపుచ్చుకుని ఎదగాలని పిలుపునిచ్చారు.

వ‌రంగ‌ల్‌లో అన్ని వ‌స‌తులు..
హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న వరంగల్ నగరం మరో హైదరాబాద్ కాబోతున్నదని తెలిపారు. ఇక్కడ పెట్టుబడులకు గొప్ప అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడిప్పుడే ఏంజిల్ ఇన్వెస్టర్లు వరంగల్ పై ఫోకస్ పెడుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరం పెట్టబడులకు స్వర్గధామం కాబోతున్నదని వెల్లడించారు. హైద‌రాబాద్ త‌ర‌హాలో వ‌రంగ‌ల్ లో కూడా అన్ని వ‌స‌తులు ఉన్నాయ‌ని తెలిపారు. త‌క్కువ ఖ‌ర్చుతో అన్ని మౌలిక స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చుకునేందుకు వ‌రంగ‌ల్ అనుకూలంగా ఉంటుంద‌ని తెలిపారు.

త‌ప‌న, అంకిత‌భావం ఉంటే పెట్టుబ‌డి అదే వ‌స్తుంది…
వ్యాపారం లేదా కంపెనీ ప్రారంభించాల‌నే త‌ప‌న‌, గొప్ప ఉత్ప‌త్తి లేదా ఆలోచ‌న‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌నే అంకిత‌భావం ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు పెట్టుబ‌డి గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌ని ర‌వి పులి పేర్కొన్నారు. తాను అమెరికా వెళ్లిన కొత్త‌లో పెట్టుబడి ఏమీ లేకుండా కంపెనీ ప్రారంభించాన‌ని చెప్పారు. ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాలి… గొప్ప సంస్థ‌ల‌ను స్థాపించాల‌నే ప‌ట్టుద‌ల‌, శ్ర‌మ, విభిన్న‌మైన ఆలోచ‌న‌ ఉంటే పెట్టుబ‌డిదారులు ప‌రుగెత్తుకుంటూ వ‌స్తార‌ని వివ‌రించారు. హైద‌రాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త‌లు స్థాపించిన కంపెనీలు ప్ర‌పంచ స్థాయికి ఎదిగాయ‌ని గుర్తుచేశారు. డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, జీవీకే, జీఎంఆర్ వంటి ఎన్నో సంస్థ‌లు హైద‌రాబాద్ నుంచి ప్రారంభం అయ్యాయ‌ని తెలిపారు. వినూత్న ఆలోచ‌న, శ్ర‌మ‌ ఉంటే విజ‌యం వ‌రిస్తుంది అన‌డానికి బైజూస్ గొప్ప ఉదాహ‌ర‌ణ అని తెలిపారు. ఒక్క రూపాయి పెట్టుబ‌డి కూడా లేకుండా సంస్థ‌ల‌ను ప్రారంభించ వ‌చ్చ‌ని అన్నారు. మ‌న వ‌ద్ద నైపుణ్యం, వినూత్న ఆలోచ‌న ఉంటే కంపెనీలు ఎటువంటి పెట్టుబ‌డి లేకుండా మ‌న‌ల్ని భాగ‌స్వాములుగా తీసుకుంటాయ‌ని తెలిపారు.

ఏంజిల్ ఇన్వెస్ట‌ర్ ఎవ‌రు ?
ఒక మంచి ఆలోచ‌న‌ను విశ్వ‌సించి, దానికి గొప్ప భ‌విష్య‌త్తు ఉంటుంద‌నే భావ‌న‌తో అంద‌రి కంటే ముందుగా అంకుర సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్టేవారే ఏంజిల్ ఇన్వెస్ట‌ర్స్ అని ర‌వి పులి తెలిపారు. ఏంజిల్ ఇన్వెస్ట‌ర్స్ స్టార్ట‌ప్‌ల విజ‌యంతో కీల‌క పాత్ర పోషిస్తార‌ని పేర్కొన్నారు. పెట్టుబ‌డి ఎంత అనేది ముఖ్యం కాద‌ని, త‌క్కువ పెట్టుబ‌డితో కూడా ఏంజిల్ ఇన్వెస్ట‌ర్‌గా రాణించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌కు స‌హ‌కారం అందిస్తూ స్టార్ట‌ప్‌లలో ఏంజిల్ ఇన్వెస్ట‌ర్లు భాగ‌స్వాములు కావ‌చ్చ‌ని వివ‌రించారు. వినూత్న ఆలోచ‌న‌లో పెట్టుబ‌డి పెట్టాల‌ని ఆలోచ‌న ఉన్న ఏంజిల్ ఇన్వెస్ట‌ర్లు టీహ‌బ్ వంటి సంస్థ‌ల ద్వారా ఏంజిల్ ఇన్వెస్ట‌ర్స్ గ్రూప్‌ల‌తో అనుసంధానం కావ‌చ్చ‌ని ర‌వి పులి తెలిపారు. స్థానిక అంకురాల్లో పెట్ట‌బ‌డి పెట్ట‌డానికి ఏంజిల్ ఇన్వెస్ట‌ర్లు ముందుకు రావాల‌ని, తాను కూడా కొన్ని సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టాన‌ని తెలిపారు. మ‌న‌కు అవ‌గాహ‌న ఉన్న రంగాల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా స్టార్ట‌ప్‌ల ఉన్న‌తిలో భాగ‌స్వాములు కావ‌చ్చ‌ని పేర్కొన్నారు.

హైదరాబాద్ ఏంజిల్స్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ రత్నాకర్ సామవేదం మాట్లాడుతూ దేశంలో స్టార్టప్ల పురోగతి తీరుతెన్నులను వివరించారు. 2014 నుంచి 2020 వ‌ర‌కు హైద‌ర‌బాద్ అంకుర సంస్థ‌లు 10,950 కోట్ల నిధుల‌ను సేక‌రించాయ‌ని తెలిపారు. రానున్న రోజుల్లో బెంగళూరును మించి, తెలంగాణ రాష్ర్టంలో స్టార్టప్లు వస్తాయని తెలిపారు. ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ గురించి శ్రోతలకు వివరించారు. టీహబ్ సీఈవో రవి నారాయణ్ మాట్లాడుతూ తెలంగాణలో స్టార్టప్లకు గొప్ప అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా పారిశ్రామిక వేత్త, వరంగల్ కు చెందిన రవి పులిని యువత ఆదర్శంగా తీసుకోవాలని, దేశానికి ర‌వి పులి అందిస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వారి సందేహాలకు ఎన్నారై పారిశ్రామిక వేత్త రవి పులి సమాధానాలు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here