ఆహా ఏమి రుచి..

32
Ankapoor Chiken
Ankapoor Chiken

#Ankapoor chiken special#

చికెన్ అంటే అంకాపూర్. అంకాపూర్ అంటే చికెన్. అంతగా ఫేమస్ అయ్యింది అంకాపూర్ చికెన్. తెలంగాణలోని ఏ జిల్లావాళ్లయినా ఒక్కసారి అంకాపూర్ చికెన్ తినాలనుకుంటారు.  చికెన్ తినడం కోసమైనా అంకాపూర్ కు టూర్ వేస్తారంటే.. అక్కడి చికెన్ ఎంత స్సెషలో అర్థమవుతుంది. మీరు కూడా అంకాపూర్ చికెన్ టెస్టు చేయాలనుకుంటున్నారా?

నిజామాబాద్ జిల్లా, ఆర్మరూ మండలంలోని చిన్న గ్రామం అంకాపూర్. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణంతో నిత్య నూతనంగా ఉంటుంది విలేజ్.  అంకాపూర్ గ్రామం పేరుతో ప్రసిద్ధిచెందిన ఈ కోడికూర తెలంగాణ వంటకంగా పేరుగాంచింది. నిత్యం వాడే మసాలాలకు భిన్నమైన మసాల దినుసులను ఈ కూర తయారీకి వాడుతారు. తరిగిన ఉల్లిలు, దంచిన అల్లం, వెల్లులి, ధనియాల పొడి కరివేపాకు, పసుపుఉండగా, కల్వంలో దంచిన ఎండు కొబ్బరి తురుము, పల్లీల పొడి, ఏలకులు, లవంగాలు, సాజీర, కొత్తిమీర లాంటివి  ఉపయోగిస్తారు.

తయారీ ఇలా

శుభ్రపరిచిన నాటుకోడి మాంసానికి పసుపు రాసి మంటపై కాలుస్తారు. శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి స్వయంగా నూరుకున్న మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి, పసుపు, ధనియాల పొడి కలిపి పదినిమిషాలపాటు ఉంచుతారు. తరువాత స్టౌవ్‌మీద పాత్రలో తగినంత పల్లీ నూనె పోసి ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి, కరివేపాకు, మెంతికూర వేసి వేగాక చికెన్ వేస్తారు. తగినంత నీరు, ఉప్పు వేసి 20 నిమిషాలు ఉండికించగా నాటుకోడి కూర తయారవుతుంది.

అంకాపూర్ టు హైదరాబాద్
నిజామాబాద్‌లోని అంకాపూర్‌లో లభించే చికెన్‌కు హైదరాబాద్‌లో ఎంతో క్రేజ్‌ ఉంటుంది. ఆ ఊళ్లో చికెన్‌ కర్రీను తయారు చేసి విక్రయించే వ్యక్తులకు ఇటీవల కాలంలో ఆర్టీసీ పార్శిళ్ల  ద్వారా డిమాండ్‌ పెరిగింది. ప్రత్యేకమైన మసాలాలతో, ఎంతో రుచిగా వండడం వల్ల అంకాపూర్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు వందలాది పార్శిళ్లు రవాణా అవుతున్నాయి. పార్శిల్‌ చార్జీలతో సహా కిలోకు రూ.650 చొప్పున తీసుకుంటున్నారు. వీకెండ్ లో పార్శిల్ సంఖ్య ఎక్కువే. ప్రతిరోజూ 30 నుంచి 50  కిలోల చికెన్‌ హైదరాబాద్‌కు పార్శిల్ అవుతుందంటే.. అంకాపూర్ చికెన్ ఉన్న డిమాండ్ ఎట్టిదో ఇట్టే అర్థమవుతుంది.

– బాలు జాజాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here