హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తీవ్ర ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్వాగతించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు సాఫ్రాన్ నిర్ణయించిందన్నారు. హైదరాబాద్‌లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దది అని తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్ఓ అని పేర్కొన్నారు. ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపు రూ. 1,200 కోట్లు అని తెలిపారు. 800 నుంచి 1000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఏరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారబోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.