తెలంగాణకు హైదరాబాద్ లోని ఏపీ భవనాలు

AP BUILDINGS TO TS

  • కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు
  • రెండు భవనాలు మినహా మిగిలినవి తెలంగాణకు ఇస్తూ నిర్ణయం
  • కేసీఆర్ ప్రతిపాదనకు జగన్ సానుకూల స్పందన

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉన్న వైరం కారణంగా పలు సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయాయి. అయితే, ఇటీవల ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం.. కేసీఆర్ నివాసానికి వెళ్లి తన ప్రమాణ స్వీకారానికి రావాలని స్వయంగా ఆహ్వానించడం.. కేసీఆర్ విజయవాడ వెళ్లి జగన్ కు అభినందనలు తెలపడం వంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఓ చక్కని వాతావరణాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందు వేదికగా రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో నిరుపయోగంగా ఉన్న ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగించాలని కేసీఆర్ కోరగా.. ఏపీ సీఎం జగన్ అందుకు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో ఆ భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ పోలీసుల కోసం ఒక భవనం.. ఇతర కార్యాలయాల నిర్వహణకు మరో భవనాన్ని ఆంధ్రప్రదేశ్ కి ఉంచి మిగిలిన అన్ని భవనాలనూ తెలంగాణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున రెండు రాష్ట్రాలకు సమానంగా ప్రభుత్వ భవనాలను కేటాయించారు. అయితే, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బుక్ కావడంతో ఆయన అమరావతి వెళ్లిపోయారు. దీంతో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సైతం క్రమంగా అక్కడకు వెళ్లిపోయాయి. దీంతో హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సచివాలయం, శాసనసభతో పాటు ఇతర భవనాలన్నీ ఖాళీగా ఉండిపోయాయి. ఏపీలో పాలన అంతా అమరావతి నుంచే జరుగుతున్నందున హైదరాబాద్‌లో ఆ రాష్ట్రానికి కేటాయించిన భవనాలన్నీ నిర్వహణ లేక దెబ్బతింటున్నాయని.. అందుకే వాటిని తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. గతంలోనూ రెండు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీలు కూడా దీనిపై పలు దఫాలుగా చర్చించాయి. కానీ అప్పటి సీఎం చంద్రబాబు సరిగా స్పందించకపోవడంతో అవి ఫలవంతం కాలేదు.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article