అమరావతి.. అసలు కథ ఇదీ!

AP CAPITAL ISSUE

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన సమయంలో కూడా ఇంత చర్చ, రచ్చ జరగలేదు. కానీ అనూహ్యంగా ఈ విషయంలో ఇప్పుడు పెద్ద గందరగోళమే రేగుతోంది. రాజధాని ప్రాంతాన్ని మార్చేస్తారంటూ పెద్దపెట్టున ఊహాగానాలు రావడంతో ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. దొనకొండలో పెడతారని కొందరు అంటుంటే, కాదు కాదు నాలుగు రాజధానులు ఏర్పాటు చేస్తారంటూ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారబోదని, పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే జరుగుందనే ప్రచారమూ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని మారిస్తే ఒప్పుకోబోమంటూ వెలగపూడి వాసులు ఆందోళనలు మొదలుపెట్టగా.. రాజధానిని తమ ప్రాంతాలోనే పెట్టాలంటూ కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ సహా విపక్షాలన్నీ రాజధాని తరలింపునకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాయి. వాస్తవానికి అమరావతి మార్పుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కేవలం మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల ఫలితంగానే ఇంతటి గందరగోళం నెలకొంది. ఆయన కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా? లేక బొత్స మాటలను తప్పుగా అర్థంచేసుకున్నారా అనే అంశాన్ని పక్కనపెడితే.. అసలు రాజధాని విషయంలో అధికార పార్టీ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది? అమరావతిని సమూలంగా మార్చేసి రాజధానిగా కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేస్తుందా? అంటే.. ఇవేవీ కాదని తేలింది.

ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చను బట్టి చూస్తుంటే.. అమరావతి మార్పు విషయంలో సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. అమరావతిని కోర్ కేపిటల్ గా కొనసాగిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది ఆయన భావనగా చెబుతున్నారు. రాజధాని తరలింపు ఉండదని, ఎంపీ టీజీ వెంకటేశ్ చెప్పినట్టుగా నాలుగు రాజధానుల ప్రతిపాదన కూడా ఏదీ లేదని పార్టీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. అయితే, కేవలం అమరావతి అభివృద్ది పైనే దృష్టి పెట్టకుండా.. వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలపైనా ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది. తద్వారా పాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది జగన్ భావన అని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో కేవలం హైదరాబాద్ పైనే దృష్టి పెట్టడంతో తదనంతర కాలంలో ఇబ్బందులు ఎదురయ్యాయని.. అమరావతి విషయంలో అలాంటి వాటికి తావు లేకుండా చూసుకునేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. మొత్తమ్మీద ఈ విషయంలో నేడో, రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజధాని తరలింపు ఊహాగానాలపై సీఎం జగన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడి మీడియాతో మాట్లాడినప్పుడు దీనిపై స్పందించే అవకాశం ఉంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article