ఆనందయ్యది సంప్రదాయ మందు

77

మూడు రకాల ఆనందయ్య మందులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఈ మందులను ఆయుర్వేదంగా గుర్తించడం లేదని, సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకోవొచ్చునని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా బాధితులు ప్రభుత్వమందిస్తున్న రెగ్యూలర్ ట్రీట్ మెంట్ పొందుతూ సప్లమెంట్ గా ఆనందయ్య మందును వినియోగించుకోచ్చునన్నారు. ఆనందయ్య మందు పంపిణీ సందర్భంగా క్యూలో కరోనా పేషెంట్లు నిల్చోవొద్దని, బంధువుల ద్వారా తెప్పించుకుని వాడుకోవాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 83,461 శాంపిళ్ల పరీక్షలు నిర్వహించగా, 7,943 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 98 మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1461 ఐసీయూ బెడ్లు, 6,323 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో, బెడ్ల ఖాళీ సంఖ్య రోసజు రోజుకూ పెరుగుతోందన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో ప్రస్తుతం 15,106 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 1,75,000 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఇండెంట్ తక్కువగా వస్తోందన్నారు. రోజువారీగా ఏపీకి కేంద్రం కేటాయించిన 590 టన్నుల ఆక్సిజన్ సోమవారం డ్రా చేశామన్నారు. కొద్ది రోజుల కిందట 800 టన్నుల వరకూ డ్రా చేశామని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీకి కేటాయించిన మేరకే ఆక్సిజన్ డ్రా చేసుకుంటున్నామని తెలిపారు. 104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 3,885 ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో 599 కాల్స్ ఆసుపత్రుల్లో అడ్మిషన్ల కోసమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఐసోలేషన్లో 24,583 మంది చికిత్స పొందుతున్నారని, వారితో 4,733 మంది వైద్యులు టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా ఫోన్లో మాట్లాడుతున్నారన్నారు. కరోనా బాధితుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ సలహాలు సూచనలు అందజేశారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here