అలోక్ వర్మను విధుల్లోకి తీసుకోండి

Appoint Alock Varma again

  • సీబీఐ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
  • ఆయన్ను సెలవుపై పంపడం సరికాదని వ్యాఖ్య

సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ చీఫ్ గా అలోక్ వర్మను పునర్నియమించింది. కేంద్రం ఆయన్ను ఏకపక్షంగా సెలవుపై పంపడం సరికాదని స్పష్టంచేసింది. అలోక్‌ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ అంశంపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత కమిటీ వారంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే, సీబీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అలోక్ వర్మ విధానపరమైన, ప్రధాన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. అలాగే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు నియామకాన్ని కూడా సుప్రీం పక్కన పెట్టింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాల మధ్య విభేదాలు బట్టబయలై ఇరువురూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఇరువురినీ సెలవుపై పంపించింది. తెలుగు వ్యక్తి అయిన ఎం. నాగేశ్వరరావుకు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంది. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే పలువురు అధికారులను బదిలీ కూడా చేశారు. ఈనేపథ్యంలో తన అధికారాలను కత్తిరించి, తనను బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో అందరి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రం తీరును తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో అలోక్‌ వర్మపై చర్యలు తీసుకోవడానికి ముందు కేంద్రం.. సెలక్ట్‌ కమిటీని సంప్రదించి ఉండాల్సింది అని అభిప్రాయపడింది. ఆయన్ను సెలవుపై పంపించడం సబబు కాదని పేర్కొంటూ వెంటనే వర్మను విధుల్లోకి తీసుకోవాలని స్పష్టంచేసింది. మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ సెలవులో ఉండడంతో తీర్పును మరో  న్యాయమూర్తి జస్టిస్‌ కౌల్‌ చదివి వినిపించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article