* ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
* మియాపూర్- బాచుపల్లి..
200 అడుగుల రోడ్డు ప్రతిపాదనలు సిద్దం
* ఏడాదిలో 330 నుంచి 340 రోజులు అందుబాటులో ఉంటా
* ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కారం
మియాపూర్ నుంచి బాచుపల్లి వరకూ రెండు వందల అడుగుల రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే పూర్తయ్యిందని.. వీటితో పాటు అదనపు రహదారులూ అవసరమైతే వేయిస్తామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మేల్లే అరికపూడి గాంధి తెలిపారు. సోమవారం మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ కల్చర్ ఫెస్ట్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. కల్వరి టెంపుల్ నుంచి కొండాపూర్ వరకు ఓ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. వివిధ క్రీడల్లో రాణించిన చిన్నారులు, యువత, మహిళలకు ఆయన పతకాల్ని అందించారు.
మంచినీరు, విద్యుత్తు, మున్సిపల్‌కు సంబంధించి ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి అవసరమైన మానిటరింగ్ వింగ్ తమకు ఉందన్నారు. వాట్సప్, ట్విట్టర్, మెసేజ్ ల ద్వారా వచ్చిన సమస్యలనూ పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఏడాదిలో 330 నుంచి 340 రోజులు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ప్రతిరోజూ నియోజకవర్గానికి సంబంధించి కీలకమైన సమస్యలను రాసుకుని, ఆ ప్రాంతాలకు వెళ్లి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని వివరించారు.
* మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎస్ఎంఆర్ వినయ్ సిటీ నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అధ్యక్షుడు కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. మియాపూర్ బాచుపల్లి రహదారిలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని.. వాటిని పరిష్కరించేందుకు రోడ్డును వెడల్పు చేయాలని కోరారు. నరేన్ ఎస్టేట్స్ ఆర్చ్ వద్ద మూసివేసిన డివైడర్ని తెరిచి.. ట్రిఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే రోడ్డు దాటడం అత్యంత కష్టంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అధ్యక్షుడు కింగ్ జాన్సన్ కొయ్యడ, సీతారామ్ కోరుకొండ, ప్రసాద్ గోరంట్ల, శరత్ బాబు, సురేష్, నవీన్, సతీష్, తన్వీర్, శేషు, తాతాజీ నాయుడు, దీపక్ కత్రీ, నిధి గర్గ్, కల్చరల్ కమిటీ సభ్యులైన జ్యోత్స్న, లలిత, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.