Asalem Jarigindi Teaser Creating Curiosity
తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రోజాపూలు ఫేమ్ శ్రీరామ్, సంచితా పదుకునే హీరోహీరోయిన్లుగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ‘అసలేం జరిగింది’ దుమ్ము రేపుతోంది. యేలేందర్ మహవీర్ సంగీతం స్వరపరిచిన ఈ సినిమాలోని అన్ని పాటలకు చక్కటి స్పందన రాగా.. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. ఈ సినిమాలోని ‘వెన్నెలా చిరునవ్వై’ పాట నాలుగు మిలియన్ల డిజిటల్ వ్యూస్ తో సత్తా చాటింది. చిర్రావూరి విజయ కుమార్ రచించిన ఈ పాటను విజయ ప్రకాష్ చక్కగా ఆలపించాడు.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని టీజర్ కూ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రెండు మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది. 8కే రిజల్యూషన్ కెమెరాతో తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సేతు స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా, టీజర్ కు మంచి మార్కులు పడ్డాయి. మార్చిలో ఈ సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.