ASHOK MAINTAIN DISTANCE TO TDP
- టీడీపీ పొలిట్ బ్యూరో భేటీకి డుమ్మా
- భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపనకూ గైర్హాజరు
- అధినేతతో విభేదాలే కారణం?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దశాబ్దాలుగా పార్టీలోనే ఉంటూ నెంబర్ టూ గా ఎదిగిన పూసపాటి అశోక్ గజపతిరాజు అలకబూనారా? పార్టీ అధినేత చంద్రబాబుతో విభేదాలు తలెత్తాయా? అందువల్లే మొన్న భోగాపురం విమానశ్రయం శంకుస్థాపనకు, తాజాగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యారా? చంద్రబాబు కూడా ఆయన్ను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడుతున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన గజపతి రాజు ప్రభుత్వ, పార్టీ ముఖ్య కార్యక్రమాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటుండంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అమరావతిలో శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన ఈ సమావేశానికి అశోక్ గజపతి గైర్హాజరు కావడం అనుమానాలు రేకెత్తించింది. రెండు రోజుల క్రితం జిల్లాలో జరిగిన భోగా పురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర యం శంకుస్థాపనకు కూడా అశోక్ గజపతి రాలేదు. భోగాపురం టెండర్ల విషయంలో చంద్రబాబుతో అశోక్‌కు మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం. అందువల్లే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయనగరంలో నిర్వహించిన బహిరంగ సభకు అశోక్ గజపతి పరోక్షంగా సహకరించారు. అమిత్ షాకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసన నిర్వహించాలని భావించినా, గజపతి రాజు వద్దని వారించడంతో పార్టీ కార్యకర్తలు మిన్నకుండిపోయారు. ఓవైపు ప్రధాని మోదీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు చేస్తుండగా.. విజయనగరంలో మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఈ విషయంలో పార్టీ శ్రేణులు మాత్రం అశోక్ గజపతి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇక కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలోనూ అధినేత తనను సంప్రదించాలని అశోక్ కినుక వహించినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పార్టీలో అత్యంత సీనియర్ నేత విషయంలో చంద్రబాబు ఏ విధంగా వ్యవహరించనున్నారో వేచి చూడాల్సిందే.