Ashwini Dutt opposes Chiranjeevi’s comments
రాజధాని అమరావతి విషయంలో రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పారు సినీ నిర్మాత అశ్వనీదత్ . రాజధాని లో పర్యటించిన ఆయన రాజధాని రైతులతో మాట్లాడి అక్కడ పరిస్థితులను ఉద్దేశించి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను దారుణంగా కొట్టారని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు బహుమానంగా ఒక్కో ఇంటికి 10 మంది పోలీసులను పెట్టారా అని మండిపడ్డారు అశ్వనీదత్ . రాజధాని రైతులకు మద్దతుగా రాజధానిలో పర్యటించిన అశ్వనీదత్ అక్కడ ప్రజలతో మాట్లాడి తన సంఘీభావం తెలియజేశారు. అక్కడ ఉన్న వారిలో నకిలీ పోలీసులు ఉన్నారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను చిరంజీవి స్వాగతించటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. చిరంజీవి తనకు ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని అశ్వనీదత్ ప్రశ్నించారు . పవన్కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే వందల కోట్లలో సంపాదిస్తారని సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరంజీవికి తెలియదా అని ప్రశ్నించారు అశ్వనీదత్ . బొత్స ఏం మాట్లాడుతున్నారో ఆయన కుటుంబ సభ్యులకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పృథ్వీ కమెడియన్ అని , ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. పృథ్వీ లాంటి వారి వల్లే జగన్ భ్రష్టు పట్టిపోతున్నారని, జగన్ కు చెడ్డ పేరు వస్తుందని చెప్పుకొచ్చారు. మద్దతు ఇవ్వని వాళ్ళ సినిమాలు చూడటం మానెయ్యాలని , అప్పుడు వాళ్ళే దిగివస్తారని చెప్పారు అశ్వనీదత్ .