తొలి వన్డే ఆసీస్ దే

Austrlia won the first One day series

  • సిడ్నీ మ్యాచ్ లో టీమిండియా ఓటమి
  • రోహిత్ శర్మ సెంచరీ వృథా

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆ జట్టుతో జరిగిన తొలి వన్డేలో బోల్తా పడింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం సిడ్నీలో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. రోహిత్ శర్మ సెంచరీ సాధించినా, టీమిండియాకు ఓటమి తప్పలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఖవాజా(59; 81 బంతుల్లో 6 ఫోర్లు), షాన్‌ మార్ష్‌(54; 70 బంతుల్లో 4 ఫోర్లు),హ్యాండ్ స్కాంబ్‌(73; 61 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు)ల హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. అనంతరం 289 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే శిఖర్ ధావన్ ఔట్ కాగా.. వెంటనే కోహ్లీ (3) కూడా ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన అంబటి రాయుడు కూడా డకౌట్ కావడంతో భారత్ పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన ధోనీ.. రోహిత్ శర్మతో కలిసి ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ నెమ్మదిగా స్కోర్ బోర్డును కదిలించారు. నాలుగో వికెట్ కు 137 పరుగులు జోడించి తర్వాత ధోనీ(51; 96 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎవరూ రోహిత్ శర్మకు అండగా నిలబడకపోవడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌(29 నాటౌట్‌; 23 బంతుల్లో 4ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రోహిత్‌ శర్మ(133;129 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు)  సెంచరీ సాధించినప‍్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. జట్టు స్కోరును పెంచే క్రమంలో రోహిత్‌ ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో యువ పేసర్‌ రిచర్డ్ సన్ నాలుగు వికెట్లు సాధించగా, బెహ్రాన్‌డార్ఫ్‌, మార్కస్‌ స్టోనిస్ తలో రెండు వికెట్లు తీశారు. పీటర్‌ సిడెల్‌కు వికెట్‌ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం జరగనుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article