బాలయోగి తనయుడికి అమలాపురం ఎంపీ సీటు?

BALAYOGI SON TO CONTEST IN AMALAPURAM

  • టీడపీ అధినేత చంద్రబాబు నిర్ణయం
  • ఈ నేపథ్యంలోనే తెలుగుదేశానికి ఎంపీ పండుల గుడ్ బై

అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అమలాపురం ఎంపీ సీటు ఈసారి వచ్చే పరిస్థితి లేనందునే ఆయన పార్టీ మారారనే వాదన వినిపిస్తున్నా.. అలాంటిదేమీ లేదని పండుల తేల్చి చెప్పారు. వైఎస్సార్ సీపీలోకి తాను పదవుల కోసం రాలేదని పేర్కొన్నారు. వాస్తవానికి అమలాపురం ఎంపీ సీటు విషయంలో టీడీపీ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. చంద్రబాబు చేయించుకున్న సర్వేలో ఈ సిట్టింగ్ ఎంపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మళ్లీ సీటిస్తే గెలుపు అనుమానం కావడంతో బాబు ఈసారి అక్కడ అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ నుంచి భారతదేశ తొలి దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ మాధుర్ ని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. బాలయోగి అంటే కోనసీమ ప్రజలకు చాలా అభిమానం. ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడే కోనసీమ బాగా అభివృద్ధి చెందింది. రోడ్ల విస్తరణ, యానాం-ఎదుర్లంక వంతెన వంటి పలు అభివృద్ధి పనులతోపాటు కోనసీమకు రైలు తెచ్చేందుకు కూడా ఆయన ఎంతో కృషి చేశారు. అయితే, హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి మృతిచెందడంతో కోనసీమ అభివృద్ధి కుంటుపడింది. ఈ తరుణంలో బాలయోగిపై ఉన్న ఆదరణను తమకు అనుకూలంగా మలుచుకునే ఉద్దేశంతో చంద్రబాబు తాజా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. బాలయోగి కుమారుడికి అమలాపురం ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా ఆ సీటు గెలవొచ్చని బాబు అంచనా వేస్తున్నారు. ఇక తనకు సీటు రాదని కచ్చితంగా తెలియడంతోనే ఎంపీ పండుల జగన్ గూటికి చేరారని అంటున్నారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article