నిర్లక్ష్యమే నుమాయిష్ లో భారీ అగ్ని ప్రమాదానికి కారణమా

Because of Irresponsibility Fire Accident was Happen

ఒక చిన్న నిర్లక్ష్యం భారీ అగ్ని ప్రమాదానికి కారణమైంది. 100 కోట్ల మేర ఆస్తి నష్టానికి కారణమయింది. ప్రాణ నష్టం లేకున్నా ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీసే పరిస్థితిని తీసుకువచ్చింది. ఎగ్జిబిషన్లో వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారస్తులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది.
అసలు హైదరాబాద్ నుమాయిష్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి కారణమేంటి..? తగిన అగ్ని ప్రమాద నివారణ చర్యలు తీసుకోకపోవడమే భారీ నష్టానికి కారణమైందా..? ఎగ్జిబిషన్ సొసైటీ నిర్లక్ష్యమే వ్యాపారులకు కన్నీటిని మిగిల్చిందా..? హైదరాబాద్ ఎగ్జిబిషన్‌లో అగ్ని ప్రమాదానికి నిర్వహకుల నిర్లక్షమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రోజూ వేల సంఖ్యలో సందర్శకులు వచ్చే ఎగ్జిబిషన్‌ను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. ఎలాంటి ఉపద్రవం తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలి. కానీ హైదరాబాద్ నుమా‍యిష్‌లో అలాంటి జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు మచ్చుకి కూడా కనిపించలేదు. ఈ అజాగ్రత్తే నిర్వాహకులకు తీవ్ర నష్టాన్ని, కన్నీటిని మిగిల్చింది. పొగ వల్ల ఊపిరి ఆడక ఆరుగురిని ఆస్పత్రి పాలు చేసింది. నిజానికి ఎగ్జిబిషన్ దగ్గర 8 ఫైరింజన్లు 24 గంటల పాటు సర్వ సన్నద్ధంగా ఉండాలి. కానీ ప్రమాద సమయంలో నుమాయిష్ దగ్గర కేవలం ఒక్కటంటే ఒక్కటే ఫైరింజన్ మాత్రమే ఉందని సమాచారం. పైగా అందులో కూడా నీరు లేదని స్వయానా జిహెచ్ఎంసి సిబ్బందే చెప్పారు. ప్రమాద స్థలానికి ఫైరింజన్లు చేరుకునేసరికి 40 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఈలోగా మంటలు వ్యాపించడం , స్టాళ్ళల్లోని సరుకు బుగ్గి అవ్వడం నిమిషాల్లోనే జరిగిపోయింది. అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకునే లోపే పదుల సంఖ్యలో దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పైగా వచ్చిన ఫైరింజన్లలో నీరు లేదు. దీంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెప్పించాల్సిన దుస్థితి ఏర్పడింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్టాల్స్ యజమానులు ఆరోపిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసినా సిబ్బంది సకాలంలో ప్రమాద స్థలికి చేరుకోకపోవడంతో మంటలు చుట్టు పక్కల వ్యాపించాయని ఆరోపిస్తున్నారు. ఎగ్జిబిషన్ ప్రమాదం కేవలం ఆస్తి నష్టంతో సరిపోయింది. అదే ప్రాణ నష్టం జరిగి ఉంటే..? పరిస్థితి ఏంటి..టిక్కెట్ల రుసుం, స్టాళ్ళ అద్దెల డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్న నుమా‍యిష్ నిర్వాహకులు సందర్శకుల భద్రత గురించి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నుమా‍యిష్ లాంటి భారీ ప్రదర్శనకు పిల్లలు, వృద్ధులు కూడా భారీ సంఖ్యలో వస్తుంటారు. ప్రమాద సమయాల్లో తొక్కిసలాట జరిగితే వారందరి పరిస్థితి ఏమిటి..? వేలాది మందిని సురక్షింతంగా తరలించడం సాధ్యమా. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article