బెంగాల్ కుంభకోణాల కథేంటి?

BENGAL SCAMS DETAILS

  • శారద, రోజ్ వ్యాలీ స్కాంల వివరాలివీ…

కోల్ కతాలో సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్ పరిస్థితుల నేపథ్యంలో దేశం దృష్టి మొత్తం ఇప్పుడు అక్కడే ఉంది. రోజ్ వ్యాలీ, శారదా పోంజీ కుంభకోణాలకు సంబంధించిన కేసులో కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకోవడం.. అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధర్నా చేయడం.. విపక్షాలు ఆమెకు బాసటగా నిలవడం.. బీజేపీ ఎదురుదాడి చేయడం వంటి పరిణామాలతో అక్కడ పరిస్థితులు వేడెక్కాయి. అసలు ఈ కుంభకోణాల కథాకమామీషేంటి? మమత ఎందుకు ఈ విషయంలో అంత తీవ్రంగా స్పందిస్తున్నారు?

పశ్చిమ బెంగాల్ లో కొంతమంది వ్యక్తులు కలిసి శారదా గ్రూప్ పేరుతో ఓ కంపెనీ స్థాపించారు. చైన్ తరహా విధానంలో నడిచే పథకాలతో ప్రజల్ని ఆకర్షించారు. తమ పథకాల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారు. అలా దాదాపు 10 లక్షల మంది నుంచి దాదాపు రూ.10వేల కోట్లు దోచుకున్నారు. 2013లో యూపీఏ హయాంలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఇందులో పలువురు తృణమూల్ ఎంపీలకు భాగస్వామ్యం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అనంతరం పోలీసుల విచారణలో అది నిజమేనని తేలింది. శారదా చిట్స్ కంపెనీ ఛైర్మన్ కమ్ ఎండీ సుదీప్ సేన్ తో పాటు పలువురు ప్రముఖుల్ని 2013 ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందార్ కు ముడుపులు అందినట్లుగా కథనాలు వచ్చాయి. అనంతరం ఐటీ, ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి.

శారదా చిట్స్ స్కాంతో ఇబ్బంది పడుతున్న దీదీ సర్కారుకు రూ.40వేల కోట్ల మేర ప్రజల నుంచి అక్రమంగా సేకరించారంటూ రోజ్ వ్యాలీ స్కాం తెరపైకి వచ్చింది. ఇది కూడా చైన్ తరహా పథకమే. ప్లాట్లను కొనుగోలు చేయాలనుకునే వారికి.. టూర్లకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని కమిషన్ పద్దతిలో.. చైన్ సిస్టంలో సభ్యులుగా చేరుస్తారు. నిర్ణీత కాలవ్యవధి తీరిన వెంటనే డబ్బులు కట్టిన వారికి 21 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపించారు. దాదాపు రూ.40 వేల కోట్లను ప్రజల నుంచి సమీకరించినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలకు ప్రమేయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణకు వచ్చిన సీబీఐ అధికారులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article