ఒకటి నొక్కారో.. మొత్తం నొక్కేస్తారు

BEWARE FROM SIM SWAP FRAUD

  • సిమ్ స్వాప్ తో చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు

‘మీ ఫోన్ నెట్ వర్క్ సరిగా లేదు. దానిని సరిచేస్తున్నాం. ఇందుకోసం మీ ఫోన్ లో ఒకటి నొక్కండి’ అంటూ మీకు ఏదైనా ఫోన్ వచ్చి.. తొందరపడి నొక్కకండి. ఒకవేళ నొక్కారో.. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును సైబర్ నేరగాళ్లు నొక్కేస్తారు. తాజాగా సిమ్ స్వాప్ విధానంతో కొత్త తరహా మోసానికి తెరతీశారు. హైదరాబాద్ లో వెలుగుచూసిన ఈ మోసంలో అంతర్జాతీయ నేరగాళ్ల గుట్టు రట్టు కావడం కలకలం రేపింది. నైజీరియాకు చెందిన ముఠా ఈ మోసానికి పాల్పడుతోంది.

సిమ్‌ స్వాప్‌ విధానంలో తొలుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాధితుడి ఫోన్‌ నెట్‌వర్క్‌ సరిగా పని చేయకుండా ఆపుతారు. తర్వాత కొంత సేపటికి నెట్‌వర్క్‌ మొబైల్‌ ఆపరేటర్‌నంటూ బాధితుడికే ఫోన్‌ చేస్తారు. మీ ఫోన్‌ నెట్‌వర్క్‌ సరిగా లేదంటూ ఏమార్చుతారు. నెట్‌వర్క్‌ సరిచేసేందుకు ‘ఒకటి’ నొక్కండి అని చెబుతారు. ఒకటి నొక్కగానే బాధితుడి ఫోన్ వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. అలా బాధితుడి సిమ్ తమ ఆధీనంలోకి రాగానే.. కొత్త సిమ్ తీసుకుంటారు. దానిని ఉపయోగించి, అతడి ఖాతాలో ఉన్న మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేసుకుంటారు. ఇందుకోసం ముందుగానే ఆ బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలను సంపాదిస్తారు. తొలుత తాము ఎంచుకున్న వ్యక్తికి మాల్ వేర్లే, ట్రోజన్లు పంపిస్తారు.

అనంతరం అతడు బ్యాంకు లావాదేవీలు నమోదు చేసేటప్పుడు కంప్యూటర్ తెరపై యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేయగానే.. ఆ వివరాలను తెలివిగా తస్కరిస్తారు. తర్వాత అతడి సిమ్ స్వాప్ చేస్తారు. దీంతో బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ వంటివన్నీ నేరగాళ్ల వద్దనున్న సిమ్ కే వస్తాయి. వాటిని ఉపయోగించి, అతడి ఖాతాలో ఉన్న సొమ్మును స్వాహా చేస్తారు. పైగా ఇందుకు శనివారాలనే ఎంచుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రం గనక ఆన్‌లైన్‌లో బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తే బాధితుడి సిమ్‌ పనిచేయదు కాబట్టి దానికి ఎలాగూ సంక్షిప్త సందేశాలు వెళ్లవు. బాధితుడు ఆదివారం బ్యాంకుకు వెళ్లే అవకాశముండదు. అందుకే నేరగాళ్లు ఆ సమయాన్ని అనువుగా భావిస్తున్నారు.

ఆన్‌లైన్‌ లావాదేవీల క్రమంలో నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే కంప్యూటర్‌ లేదా ఫోన్ లో వర్చువల్‌ కీబోర్డును వినియోగించడం ఉత్తమమని సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. సిమ్ స్వాప్ విధానంలో మరో విధానంలోనూ మోసగాళ్లు తెగబడుతున్నారు. మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్ల మాదిరిగా బాధితులకు ఫోన్ చేసి, సిమ్‌ను అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉందని, లేకపోతే బ్లాక్‌ అవుతుందని హెచ్చరిస్తారు. అప్‌గ్రేడ్‌ చేసేందుకు సిమ్‌ వెనకాల ఉన్న 20 అంకెల నంబరును చెప్పాలని సూచిస్తారు. అది తెలుసుకున్న తర్వాత తమ సిమ్ పోయిందని చెప్పి కొత్త సిమ్ సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

FRAUD ALERT

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article