బీజేపీ సమావేశాలకు భూమి పూజ

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణపై పార్టీ నేతలు సోమవారం భూమి పూజ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ సహా భూమి పూజలో పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం కావాలని భూమి పూజ నిర్వహించామని అన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా కొనసాగాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్, పార్టీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి తదితరులతో కలిసి డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ…. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ పదాధికారులు పాల్గొనబోతున్నారని తెలిపారు. ఈ సమావేశాలు విజయవంతంగా జరగాలని ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యవర్గ సమావేశాల అనంతరం వచ్చే నెల 3న సాయంత్రం పరేడ్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాది మంది జనం తరలి వస్తారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా సభను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల, ఉద్యమకారుల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతోందని, ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రజలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారని, ఆ తల్లికి బంధ విముక్తి కల్పించడంతోపాటు రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article