Bhuma Vs AV Subba Reddy in Kurnool
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాలు స్థానికంగా పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పై ఆసక్తి పెరుగుతోంది. ఏ నియోజకవర్గం నుండి, ఏ పార్టీ నుండి, ఎవరు బరిలోకి దిగుతారు అనే ఆలోచన స్థానికంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కోసం కసరత్తులు చేస్తున్న పార్టీలు గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీలో అభ్యర్థుల విషయంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సస్పెన్స్ నెలకొంది. ఎవరికి టికెట్ వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే సీఎం చంద్రబాబు నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేల ఆధారంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు ఉన్న వారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక రాజకీయంగా బలంగా ఉన్నా సరే ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేకపోతే నిర్మొహమాటంగా టిక్కెట్ ఇవ్వనని తేల్చి చెప్తున్నారు చంద్రబాబు. అయితే ఈ క్రమంలోనే కొందరు మంత్రులకు సైతం చెక్ పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇక పార్టీని నమ్ముకొని నిబద్ధతతో పని చేసిన నాయకులకు ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికి సైతం స్థానికంగా మంచి పేరు ఉంటే అవకాశమివ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఇక ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక నియోజకవర్గాలుగా ఉన్న ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాల విషయంలో స్థానిక ప్రజలతో పాటు, అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి పెరిగిపోతుంది. ఈ మూడు నియోజకవర్గాల్లో భూమా కుటుంబమే ఆధిపత్యం చెలాయిస్తుంది. కానీ ఈసారి భూమా కుటుంబానికి చెక్ పెట్టేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కర్నూలు నుండి గెలిచి ఎస్వి మోహన్ రెడ్డి (అఖిల ప్రియ మేనమామ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నంద్యాల నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆళ్లగడ్డ నుంచి నుంచి మంత్రి అఖిల ప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి ఈ ముగ్గురికి సీటు వస్తుందా అంటే కాస్త అనుమానం అన్నది వ్యక్తమవుతోంది.ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియ పోటి చేసే అవకాశాలు ఉన్నా నంద్యాల సీటు బ్రహ్మానంద రెడ్డికి ఇస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ అఖిల్రప్రియకు కచ్చితంగా సీటు కావాలి అనుకుంటే నంద్యాల సీటు వదులుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కర్నూలు నుంచి మోహన్ రెడ్డి పోటీ విషయంలో ఆసక్తి నెలకొంది. టీజీ వెంకటేష్ కుమారుడు అక్కడ సీటు ఆశిస్తున్నారు. అప్పుడు లోకేష్ దీనిపై ప్రకటన చేసిన అనంతరం మోహన్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అయితే తాజాగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి సైతం ఒక కీలక ప్రకటన చేసారు. .ఇటీవల మంత్రి అఖిల ప్రియకు, ఏవీ సుబ్బారెడ్డి కి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.నంద్యాల అసెంబ్లీ స్థానానికి టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన సుబ్బారెడ్డి… 6వ తేదీ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ సంక్షేమ పథకాలు, ఇటీవల సీఎం ప్రకటించిన వరాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంలో భాగంగానే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధిష్టానం టికెట్ ఎవ్వరికి ఇచ్చినా వారి గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అయితే తాను ఈసారి పోటీ చేయాలని ఆసక్తితో వున్నానని నంద్యాల టికెట్ తనకే కేటాయిస్తే బరిలో ఉంటానని ప్రకటించారు.దీనితో భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి చెక్ పెడుతున్నారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.