BIRTHDAY WISHES TO KCR
- మొక్కలు నాటి కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పిన కుటుంబ సభ్యులు
- రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి సహా పలువురు ప్రముఖుల బర్త్ డే విషెస్
పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులు మొక్క నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి భవన్ లో ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటి కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘మా కుటుంబ సభ్యుల్లో ప్రతీ ఒక్కరు ఒక్కో మొక్క నాటాం. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని కోరుకుంటున్నాము. అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన మా తండ్రి అయినందుకు ఎంతో గర్విస్తున్నా’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ప‍్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని ప్రధాని మోదీ, వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు మొక్కలు నాటి శుభాకాంక్షలు చెబుతున్నారు.