తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బిగ్ స్కెచ్ వేస్తున్నది. తాజాగా ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ ఆఫర్ చేసి.. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మార్చే ప్లాన్ చేస్తుంది. తెలంగాణలో బీసీ ఉద్యమ రథ సారథిగా ఆర్ కృష్ణయ్యను రంగంలోకి దింపేందుకు బీజేపీ స్కెచ్ వేసింది. ఇదే సమయంలో బీసీ నేతగా ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకే ఆర్.కృష్ణయ్యను బీజేపీ పాత నేతలు తెర మీదకు తెచ్చినట్లుగా మారింది. బీసీ సామాజిక వర్గ ఉద్యమ నేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్.కృష్ణయ్య సుపరిచితులు. బీసీల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. 2014 లో టీడీపీ తరపున ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆర్ కృష్ణయ్య, 2019 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి 2022 లో వైసీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ, ఇదే సమయంలో అక్కడి నుంచే కృష్ణయ్యకు బీజేపీ ఆఫర్ ఇచ్చింది. దీనిలో బీజేపీ ఆంతర్యం ఏమిటనేదే ఇప్పుడు హాట్ టాపిక్.
ఎక్కడ రాజీనామా చేశారో.. అక్కడే
తాజాగా ఆర్ కృష్ణయ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీసీ ఉద్యమ నేత, బీసీ సామాజిక వర్గాలల్లో మంచి పట్టున్న నేత కావడంతో అటు టీడీపీ, ఇటు బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెంచుకునేందుకు భారీగానే ప్రణాళికలు వేస్తున్నాయనే టాక్ నడుస్తోంది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బరిలో దిగి బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే . తెలంగాణ ప్రజలు బీజేపీ బీసీ నినాదాన్ని పెద్దగా పట్టించుకోలేదనే దానికి ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. మిషన్ 90 లక్ష్యంతో 90 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘుందన్ రావు, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, లాంటి హేమాహేమీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఎన్నికల అనంతరం బీజేపీ కార్యాలయంలో నాలుగు గోడల మధ్యనే పరిమితమైన పంచాయతీలన్నీ రచ్చకెక్కడంతో నేతలంతా పుట్టకొకరు, చెట్టుకొకరు అన్నట్టుగా తయారైంది. ఇక రాష్ట్ర బీజేపీలో ఈ పంచాయితీలకు చెక్ పెట్టేందుకు డిల్లీ పెద్దలు భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
సొంత నేతలతో సతమతం
రాష్ట్ర బీజేపీ ఇప్పటికే కొత్త, పాత నేతల పంచాయితీలతో సతమతమవుతుంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయామన్న అంతర్మధనం పార్టీలోని పాత నేతల్లో కనిపించడం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకునే పనిలో పార్టీ ఉంది. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగింపు తరువాత, మళ్ళీ కిషన్ రెడ్డికే అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం బండి సంజయ్, కిషన్ రెడ్డిలిద్దరూ కేంద్ర మంత్రుల హోదాలో ఉన్నారు. సంస్థగత ఎన్నికలు జరుగుతుండటంతో అధ్యక్షుడు ఎవరనే సస్పెన్స్ కాషాయ పార్టీలో కొనసాగుతుంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ఎంపికవుతారన్న ప్రచారం బలంగా జరుగుతుంది. ఈ నేపధ్యంలో తాజాగా బీసీ నేత ఆర్ కృష్ణయ్యను తెర మీదకు తీసుకు రావడం ఈటల రాజేందర్ కు చెక్ పెట్టేందుకే అన్న చర్చ మొదలైంది. ఈటల రాజేందర్ కన్న ఆర్ కృష్ణయ్య బీసీ సామాజిక వర్గాల్లో బలమైన నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకున్న బీజేపీ అది ఎన్నికల స్టంట్ అనే ముద్ర బీసీల్లో పడకుండా బీసీ నేతకు రాజ్యసభ ఇచ్చారనే టాక్ సైతం వినిపిస్తోంది. ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు వెళ్తుండటంతో ఈటలకు పార్టీ పదవి ఇవ్వకపోయినా బీసీల్లో అంత వ్యతిరేకత రాదన్న వాదన వినిపిస్తుంది. ఏపీ బీజేపీ కోటాలో రాజ్యసభకు వెళ్తున్న ఆర్.కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో ఏ రూల్ పోషిస్తారనేసందేహాలు అందరిలో ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఎస్సీ సామాజికవర్గంలో వర్గీకరణ చేస్తామంటూ మంద కృష్ణ మాదిగను తమ గుప్పెట్లో పెట్టుకున్న బీజేపీ… తాజాగా బీసీ సామాజికవేత్త ఆర్. కృష్ణయ్య తమవైపు తిప్పుకుంది. ఇదంతా వచ్చే స్థానిక, జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అంటున్నారు. ఆ రెండు సామాజిక వర్గాల అండతో రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి రావొచ్చనే అంచనా తోనే బీజేపీ పాచికలు కదుపుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంతేకాదు బీసీల్లో ఈటల తప్ప బీజేపీకి దిక్కులేదు అన్న ప్రచారాలకు చెక్ పెట్టినట్లయ్యిందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.