BLUFF MASTER REVIEW

ప్ర‌తి ఒక్క‌రినీ ప‌రిస్థితులు మారుస్తుంటాయి. అది మంచిగా అయినా, చెడుగా అయినా.. అయితే మ‌నుషుల‌పై చెడు ప్ర‌భావం మాత్రం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా మ‌నం ప్ర‌తిరోజూ న్యూస్ పేప‌ర్స్‌, చానెల్స్‌లో జ‌రుగుతున్న మోసాల‌ను చూస్తూనే ఉన్నాం క‌దా. జీవితంలో ఎద‌గాల‌నుకునే మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఎవ‌డో ఒక‌డు, ఏదో ఒక రూపంలో మోసం చేస్తూనే ఉంటాడు. మోసం చేయడానికి కూడా ఓ తెలివి కావాలి. అలాంటి తెలివైన వాడి క‌థే బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌. ఇది ఓ ర‌కంగా మ‌న నిజ జీవితంలో ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన‌ట్లు క‌న‌ప‌డ‌తుంది. మ‌రి ఈ బ్ల‌ఫ్ మాస్ట‌ర్ ఎవ‌రిని, ఎలా?  మోసం చేశాడు అనేది తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం…
స‌మ‌ర్ప‌ణ‌:  శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌
నిర్మాణ సంస్థ‌లు:  అభిషేక్ ఫిలింస్‌, శ్రీదేవి మూవీస్‌
న‌టీన‌టులు:  సత్యదేవ్, నందిత శ్వేతా, పృథ్వి, బ్ర‌హ్మాజీ, ఆదిత్యామీన‌న్‌,  సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, జబర్దస్త్ మహేష్, ధ‌న్‌రాజ్‌, వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, `దిల్‌` ర‌మేష్‌ త‌దిత‌రులు
క‌థ‌:  హెచ్‌.డి.వినోద్‌
ఆడిష‌న‌ల్ డైలాగ్స్‌:  పుల‌గం చిన్నారాయ‌ణ‌
సంగీతం:  సునీల్ క‌శ్య‌ప్‌
కూర్పు: న‌వీన్ నూలి
క‌ళ‌:  బ్ర‌హ్మ క‌డ‌లి
కెమెరా:  దాశ‌ర‌థి శివేంద్ర‌
నిర్మాత‌:  ర‌మేశ్ పిళ్లై
మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  గోపీ గ‌ణేష్ ప‌ట్టాబి
క‌థ‌:
చిన్న‌ప్పుడు జ‌రిగిన ప‌రిస్థితుల కార‌ణంగా ఉత్త‌మ్‌కుమార్ ఓ బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌లా త‌యార‌వుతాడు. ఈ లోక‌మంతా డ‌బ్బు చుట్టూనే ప‌రిగెడుతుంద‌ని, కాబ‌ట్టి ఆ డ‌బ్బును సంపాదించ‌డానికి మోసం చేయ‌డంలో త‌ప్పు లేద‌ని భావించిన త‌ను అతిగా ఆశ‌ప‌డే మ‌ధ్య త‌ర‌గ‌తివారిని మోసం చేస్తూ ఉంటాడు. సింగ‌రాయ కొండ‌లో ధ‌నశెట్టి(ప‌థ్వీ)ని ఓ ర‌కంగా మోసం చేస్తే.. వైజాగ్‌లో ఆకాష్ అనే పేరుతో ఫేక్ కంపెనీ పెట్టి వంద‌ల మందిని మోసం చేస్తాడు. ఈ క్ర‌మంలో అవ‌ని(నందితాశ్వేత‌) ప‌రిచ‌యం అవుతుంది. ఉత్త‌మ్ మంచివాడు అనుకుని అత‌న్ని ప్రేమిస్తుంది కూడా. అయితే అత‌నొక మోస‌గాడ‌ని తెలుసుకుని బాధ‌ప‌డుతుంది. త‌ర్వాత  క‌ళింగ ప‌ట్నంలో సాగ‌ర్ అనే పేరుతో మోసం చేస్తుండ‌గా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే కోర్టు త‌న‌పై సాక్ష్యాల‌ను చెల్ల‌నీయ‌కుండా చేసి త‌ప్పించుకుంటాడు ఉత్త‌మ్‌. కానీ అత‌ని జీవితంలో డ‌బ్బు కోసంఎదుటి వారిని చంప‌డానికి కూడా వెన‌కాడ‌ని ఆదిత్య‌మీన‌న్ ప్ర‌వేశిస్తాడు. అత‌ని ద‌గ్గ‌రి నుండి త‌ప్పించుకోవ‌డానికి ఓ కేసులో పోలీసుల‌కు ఇరికించి త‌ప్పించుకున్నా.. అత‌ని చేతిలో మోస పోయిన వాళ్లు వెంబ‌డిస్తారు. వాళ్ల బారి నుండి ఉత్త‌మ్‌ను అవ‌ని కాపాడుతుంది. ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని లోకంలో డ‌బ్బొక‌టే ప్ర‌ధానం కాద‌ని తెలుసుకుని మంచివాడుగా మారుతాడు ఉత్త‌మ్‌. అత‌నికి అవ‌నితో పెళ్ల‌వుతుంది. ఇద్ద‌రూ చిక్ మంగళూర్ వెళ్లిపోతారు. అయితే జైలు నుండి వ‌చ్చిన ఆదిత్య‌మీన‌న్ అక్క‌డ‌కు వ‌స్తాడు. ఉత్త‌మ్‌ని, అత‌ని భార్య‌ను చంపేస్తాన‌ని భ‌య‌పెడ‌తాడు. చివ‌ర‌కు ఉత్త‌మ్ వంద‌కోట్ల రూపాయ‌ల స్కామ్ గురించి చెబుతాడు.  ఆ ప్లాన్ ఏంటి?  నిజంగానే డ‌బ్బులు వ‌చ్చాయా? ఉత్త‌మ్, అవ‌నిల జీవితం ఎలాంటి మ‌లుపు తిర‌గింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
స‌మీక్ష‌:
న‌టీన‌టుల ప‌రంగా చూస్తే ఘాజి, అంత‌రిక్షం, జ్యోతిల‌క్ష్మీ చిత్రాల్లో కీల‌క పాత్ర‌ధారి అయిన స‌త్య‌దేవ్ తొలిసారి పూర్తిస్థాయి హీరోగా న‌టించాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే బ్ల‌ఫ్ మాస్ట‌ర్ పాత్ర‌కు ప‌క్కాగా సూట్ అయ్యాడు. పాత్ర‌లో ఒదిగిపోయాడు. త‌నను బేస్ చేసుకుని భ‌విష్య‌త్‌లో కొత్త పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కులు క్రియేట్ చేసే అవ‌కాశాలున్నాయి కూడా. ఇక అమాయ‌క‌మైన అమ్మాయి పాత్ర‌లో నందితాశ్వేత చ‌క్క‌గా న‌టించింది. ఇక ఆదిత్య‌మీన‌న్‌, ర‌మేష్‌, పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన సిజ్జు, ఆకెళ్ళ రాఘ‌వేంద్ర త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఇక సాంకేతికంగా చూస్తే గోపీగ‌ణేష్ త‌మిళ మాతృక `చదురంగ వేట్టై`కు చిన్న చిన్న మార్పులు మాత్ర‌మే చేశాడు. మాట‌లు చ‌క్క‌గా రాసుకున్నాడు. అయితే అవుట్ డేటెడ్ ప్లాట్‌లా అనిపిస్తుంది. అయితే మోసం చేసే స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు చ‌క్క‌గా ఉంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం,నేప‌థ్య సంగీతం బావుంది. బాల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ ప‌రావాలేదు. స‌న్నివేశాల్లో ఉత్కంఠ‌త గ్రాఫ్ డౌన్ అయ్యింది. ఇంట‌ర్వెల్ త‌ర్వాత సన్నివేశాలు నెమ్మ‌దించాయి. మొత్తంగా చూస్తే త‌మిళ వెర్ష‌న్‌లోనే సినిమా వ‌చ్చి చాలా కాల‌మైంది. తెలుగులో ఇప్ప‌టికి అది అవుట్‌డేటెడ్ అయ్యింది. దానితో మ‌ళ్లీ సినిమా చేయ‌డం ఎక్కువ మందిని మెప్పించ‌క‌పోవ‌చ్చు.
బోట‌మ్ లైన్‌: బ‌్ల‌ఫ్ మాస్ట‌ర్‌.. ఓకే అనిపిస్తాడు
రేటింగ్‌: 2.5/5
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article