గోల్కొండ కోటలో బోనాల సందడి

Spread the love

Bonala Celebrations in Golkonda Fort

తెలంగాణా రాష్ట్రంలో ఆషాఢమాస బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గోల్కొండ బోనాల ఉత్సవాలు సందడి చేస్తున్నాయి . బోనాల ఉత్సవాల్లో భాగంగా గురువారం జులై 4వ తేదీ లంగర్‌హౌస్‌లో తొట్టెల ఊరేగింపును రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక అమ్మవారు తొలి పూజ అందుకున్నారు. మంత్రులు అమ్మవారికి బంగారు, వెండి బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.చారిత్రక ఉత్సవంగా పేరొందిన బోనాల పండగను వైభవంగా నిర్వహించేందుకు అటు ప్రభుత్వం..ఇటు ఆయా ఆలయాల కమిటీలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. బోనాల ఉత్సవాలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండలో నెలరోజులపాటు ప్రతి గురు, ఆదివారాల్లో జగదాంబిక అమ్మవారు 9 పూజలు అందుకోనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ బోనాల సందర్భంగా 2వేల 845 దేవాలయాలకు ప్రభుత్వం తరఫున 15 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. గోల్కొండ దేవాలయానికి 10 లక్షల రూపాయలు కేటాయించామని తెలిపారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పడాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. గోల్కొండ కోటలో అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తున్నారు. గురువారం జులై 4 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు గోల్కొండ కోటలో అమ్మవారికి భక్తులు అషాఢమాస బోనాలు సమర్పిస్తారు. ప్రతి గురు, ఆదివారం రోజుల్లో అమ్మవార్లకు బోనాల సమర్పిస్తారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు బోనాల ఊరేగింపు కొనసాగింది. గోల్కొండకోటలో జరిగిన పూజా కార్యక్రమాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. మహిళల ప్రత్యేక పూజలు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపుతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *