బాబుతోనే బొండా మైండ్ గేమ్?

BONDA MIND GAME ON BABU

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ తమ అధినేతతోనే రాజకీయాలు ప్రదర్శిస్తున్నారా? బాబుతోనే మైండ్ గేమ్ ఆడుతున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు, నేతలు ప్రత్యర్థులపై మైండ్ గేమ్ ఆడటం మామూలే. అవతలివారికి పార్టీ మారే ఆలోచన లేకున్నా.. ఆయన పార్టీ మారుతున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా చివరకు పార్టీ మారే పరిస్థితి కల్పిస్తారు. అలాగే సొంత పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోయినా.. తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలన్నా కూడా కొంతమంది నేతలు ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతుంటారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు పార్టీలోని కాపు నేతలంతా సమావేశమై కాక రేపారు. ఏదో జరిగిపోతుందనే సీన్ క్రియేట్ చేయడం ద్వారా అధినేతతోపాటు టీడీపీ శ్రేణుల్లో ఆందోళన సృష్టించారు. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు వారితో మాట్లాడి అప్పటికి సర్దుబాటు చేశారు. ఆ సమయంలో ఆ నేతలు లేవనెత్తిన డిమాండ్లలో కొన్నింటికి బాబు అంగీకరించక తప్పలేదని సమాచారం. దీంతో ఇదే సూత్రాన్ని తాజాగా బొండా ఉమ అవలంభించారని చెబుతున్నారు. తొలుత తాను పార్టీ మారుతున్నానంటూ ఫీలర్లు వదిలిన ఆయన.. చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాపైనే ఎదురు దాడి చేయడం చూస్తుంటే అదే నిజమనిపిస్తోందని అంటున్నారు. ఏదో ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని బొండాయే ఈ డ్రామా ఆడి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ సీపీలోనూ తనకు ప్రాధాన్యత దక్కుతుందో లేదో అనే ఆందోళన రావడంతోనే నిర్ణయాన్ని మార్చుకుని ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద పార్టీ మార్పు ప్రచారం ద్వారా బొండా లాభపడ్డారో లేదో త్వరలో తెలిసే అవకాశం ఉంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article