తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత మృతి కేసులో చిక్కుముడి వీడింది. ఆమెది హత్యగా తేల్చారు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు. ఆమెతో పాటు ఉన్న స్నేహితుడు, ప్రియుడైన మహేష్‌వర్మ ఆమెను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. వరంగల్ (ములుగు జిల్లా మంగపేటకు) చెందిన అక్షిత ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం కర్ణాటకలోకి చిక్‌బళ్లాపూర్ మెడికల్‌కాలేజీలో డీఎన్‌బీ (పీజీ) చేస్తోంది. అయితే అక్షిత, సంగారెడ్డి పటాన్‌చెరువుకు చెందిన మహేష్ వర్మ అనే వ్యక్తితో కలిసి తాజాగా హిందూపురంలోని ఓ లాడ్జిలో బస చేశారు. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయినట్లు మహేష్ పోలీసులకు సమాచారం అందించాడు.
* ఇద్దరం స్నేహితులమని, మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నామని, లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని మహేష్ పోలీసులకు చెప్పాడు. దీంతో స్థానికంగా అనుమానాస్పద మృతి కలకలం రేగింది. వెంటనే పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం ఇచ్చి అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో అతను స్నేహితుడు కాదని, ప్రియుడని తేలింది. హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్న మహేష్.. అక్షితతో తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. లాడ్జిలో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అయితే ఆమెను ఎందుకు చంపాడనే విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు. అక్షితకు వివాహమైందని, ఆమె భర్త వరంగల్‌లో ఆర్థోపెడిక్ వైద్యుడు కాగా, ఏడాది పాప కూడా ఉందని సమాచారం.