10న ఎనిమిది మందితో కేబినెట్ విస్తరణ?

This Month 10th Cabinet will extend with 8 members

  • ముహూర్తం దాదాపు ఖరారు

ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 40 రోజులు కావస్తున్నా.. మంత్రివర్గ విస్తరణ జరపకపోవడంతో ఉత్కంఠతో ఉన్న ఆశావహుల నిరీక్షణ ఫలించనుంది. ఫిబ్రవరి 10న కేబినెట్ ను విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ రోజున వసంత పంచమి కావడంతో మంత్రివర్గ విస్తరణకు అదే శుభ ముహూర్తమని ఆయన భావిస్తున్నారు. వాస్తవానికి సంక్రాంతి తర్వాత మంచి రోజులే ఉన్నప్పటికీ.. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ, ముహూర్తాలు సరిగా కుదరకపోవడం వంటి కారణాలతో కేబినెట్ విస్తరణను ఫిబ్రవరి 10న తలపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలి విడతలో ఎనిమిది మందితోనే కేబినెట్ ఏర్పాటు చేయాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల తర్వాత మరో ఎనిమిది మందిని కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. తొలి విడతలో ఎవరిని తీసుకోవాలనే అంశంపై కేసీఆర్ కసరత్తు పూర్తయినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం పాతవారికే ఛాన్స్ ఉంటుందని, కొత్తవారికి లోక్ సభ ఎన్నికల తర్వాతే అవకాశం ఉంటుందని అంటున్నారు. టీఆర్‌ఎస్‌లో, ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్‌ నేతలకు మంత్రిపదవి దక్కే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటల రాజేందర్‌ (కరీంనగర్‌),కడియం శ్రీహరి (జనగామ), జి. జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), సి. లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్‌), కేటీ రామారావు (సిరిసిల్ల), టి. హరీశ్‌రావు (సిద్దిపేట), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (గ్రేటర్‌ హైదరాబాద్‌), జోగు రామన్న (ఆదిలాబాద్‌)లకు తొలి విడతలో అవకాశం దక్కొచ్చని అంచనా. మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాని వారికి ఇతర ముఖ్యమైన పదవులు అప్పగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేబినెట్‌ హోదా ఉండే పదవుల్లో డిప్యూటీ స్పీకర్‌తోపాటు శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌ విప్, మండలిలో చీఫ్‌ విప్, శాసనసభలో, మండలిలో ఇద్దరు లేదా ముగ్గురేసి చొప్పున విప్‌ల పదవులు ఉన్నాయి. ఇవి కాకుండా పార్లమెంటరీ కార్యదర్శుల పేరుతో మరికొందరికి కూడా అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ పేరు వినిపిస్తోంది. స్పీకర్‌ పదవిని ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంతో ఈసారి పద్మాదేవేందర్‌రెడ్డికి ఆ అవకాశం లేకపోవచ్చు. ఆమెకు మలి దశ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి లేదా మరో కేబినెట్‌ హోదా పదవి ఇవ్వొచ్చని అంటున్నారు. 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article