ఈ వారంలోనే క్యాబినెట్ విస్తరణ

Cabinet Spreading this weak

తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కోసం అటు టిఆర్ఎస్ పార్టీ లోని ఆశావహులు, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు మంత్రివర్గం విస్తరణ చేయకపోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇక ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్న గులాబీ బాస్ మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయకుంటే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు కూడా ఆర్థిక మంత్రి లేని పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఈ నెల 7న లేదా 8 వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

గతేడాది డిసెంబ‌ర్ 13న సీఎం కేసిఆర్ తోపాటు హోమ్ మంత్రిగా మ‌హ్మూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మంచిరోజులు లేకపోవడంతో సంక్రాంతి త‌ర్వాత తెలంగాణ మంత్రివ‌ర్గ విస్తర‌ణ ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ కేసిఆర్ చేపట్టిన యాగం కారణంగా క్యాబినెట్ విస్తరణ ఆల‌స్యమైంది. ఇక రేపటినుంచి మాఘ‌మాసం మొద‌లు కావ‌డంతో కేసీఆర్ మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌కు సిద్దమైన‌ట్టు వార్తలు వస్తున్నాయి. ఈనెల 7న లేదా 8వ తేదీన మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఉంటుంద‌ని టిఆర్‌ఎస్‌లో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ఈ నెల 18 కేంద్ర ఆర్థిక సంఘం బృందం హైద‌రాబాద్ పర్యట‌న‌, ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స‌మావేశాలు జ‌రుగ‌నుండ‌టంతో ఈలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆరెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా తొలివిడతలో 8 నుంచి 10మందికి మాత్రమే చోటు ఉంటుంద‌ని సమాచారం. దీంతో మొదటి విడతలోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు ఆశావాహులు. పాత మంత్రుల్లో కేటిఆర్, హ‌రీష్ రావ్ ల‌తో పాటు మ‌రో ఇద్దరికీ చోటు ద‌క్కనున్నట్టు టీఆరెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article