ప్రజలతో ఆడుకుంటున్న బెంగళూరు ‘క్యాండియర్’

candeur 24/7 work worrying people

బెంగళూరు నిర్మాణ సంస్థ హైదరాబాద్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నది.  పోలీసుల మాటల్నిఅసలేమాత్రం లెక్క చేయట్లేదు. ఏకంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ చెప్పినా లైట్ తీసుకుంటున్నది. స్థానిక జీహెచ్ఎంసీ అధికారుల మాట పెడ చెవిన పెడుతూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నది. హైదరాబాద్లో అక్రమంగా, అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న ఆ బెంగళూరు నిర్మాణ సంస్థ పేరేమిటి? ఇంతకీ సంస్థ ఎక్కడ నిర్మాణం చేపడుతోంది? 

బెంగళూరుకు చెందిన క్యాండియర్ అనే నిర్మాణ సంస్థ.. మియాపూర్లోని బాచుపల్లి రోడ్డులో డీమార్ట్ ఎదురుగా సుమారు ఐదు ఎకరాల స్థలంలో తొమ్మిది వందలకు పైగా ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఒక్కో టవర్ నలభై అంతస్తుల ఎత్తులో నిర్మించేందుకు ఈ సంస్థ జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నది. రెరా తుది అనుమతి లేకుండానే యూడీఎస్ విధానంలో కొన్ని ఫ్లాట్లను కొంతమంది కొనుగోలుదారులకు ఏడాది క్రితం నుంచి విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు రెరా నుంచి ఫైనల్ అప్రూవల్ రావాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా.. ఈ సంస్థ యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు అమ్మడం.. వారి నుంచి ఒత్తిడి పెరడగంతో.. ఇటీవల దసరా రోజుల నిర్మాణ పనుల్ని ప్రారంభించింది. అయితే, తమ పక్కనే నలభై అంతస్తుల ఎత్తులో నిర్మాణం వస్తుందని చుట్టుపక్కల అపార్టుమెంట్ వాసులు ఆనందించారు. వారి ఆనందం కొద్ది గంటల వ్యవధిలోనే ఆవిరైంది. కారణం, కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి ఉందన్న ఏకైక కారణంతో సదరు సంస్థ.. రాత్రింబవళ్లు పునాదుల్ని తవ్వే పనుల్లో పడింది. రాత్రి పది దాటిన తర్వాత అంటే రాత్రంతా సెల్లార్ ను తవ్వుతుండటంతో చుట్టుపక్కల వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు సంస్థ ప్రతినిధులతో చర్చించారు. అయినప్పటికీ, క్యాండియర్ సంస్థ తమ వైఖరిని మార్చుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కొందరు అపార్టుమెంట్ వాసులు పోలీసులను సంప్రదించారు. సైబరాబాద్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, సదరు బెంగళూరు నిర్మాణ సంస్థ ఎవరినీ లెక్క చేయడం లేదు. పోలీసులు రాగానే పని బంద్ చేయడం.. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత పనుల్ని కొనసాగించడం వంటివి చేస్తున్నారు.

  • క్యాండియర్ పక్కనే గల అపార్లుమెంట్లలో అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాల సమయానికి అనుగుణంగా కొందరు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ఎక్కువ కాలం నైట్ కాల్స్ ఉంటాయి. పైగా, రాత్రంతా పడుకోకుండా ఉంటే పెద్దవాళ్లకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. మహిళలు, చిన్నారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పది కాగానే.. పొడువాటి సుత్తితో తమ నెత్తి మీద బలంగా కొట్టినట్టు ఉంటుందని, ప్రతిరోజు ఇదే సమస్యతో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నామని ఎస్ఎంఆర్ వినయ్ సిటీకి చెందిన గోపి తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంస్థలకు నిర్మాణ అనుమతుల్ని మంజూరు చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా తగిన చర్యల్ని తీసుకోవాలని  రిటైర్డ్ బ్యాంకర్ రామక్రిష్ణన్ కోరుతున్నారు.
  • నిబంధనల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్మాణ పనుల్ని చేయాల్సిన సదరు బెంగళూరు సంస్థ  గత పది రోజుల్నుంచి రాత్రంతా పనులు చేస్తున్నది. దీంతో, ఏం చేయాలో దిక్కుతోచని ఆ కుటుంబాలు 100కు డయల్ చేసినా, మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో, బాధితులంతా వరుసగా సైబరాబాద్ కమిషనర్ కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికైనా రాత్రిపూట పది తర్వాత నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని సదరు అపార్టుమెంట్ వాసులు అటు ప్రభుత్వాన్ని ఇటు పోలీసుల్ని కోరుతున్నారు. ఇప్పటికైనా సైబరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నారు.

banglore canduer troubling hyderabadis 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article