తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఇంత దౌర్జన్యంగా ఎన్నడూ ప్రవర్తించలేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ నేతలు ఇలా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం దారుణమైన విషయం. నిజంగా సమస్యలేమైనా ఉంటే, వాటిని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ, ఇలా దౌర్జన్యం చేయడం మాత్రం దారుణమైన విషయం. బీజేపీ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుందనే సంకేతం ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే.. ఆ పార్టీ కార్పొరేటర్లు ఇలా వ్యవహరించారని ఇట్టే అర్థమవుతోంది. దీంతో, ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేశారు. ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఆఫీసులో ఇటీవల బీజేపీ కార్పొరేటర్లు నానా హంగామా సృష్టించడంలో.. రాంనగర్, ముసరాంబాగ్, బేగంబజార్, ఆర్కేపురం, గన్‌ఫౌండ్రి, మాల్కాజ్‌గిరి కార్పొరేటర్లు ప్రధాన ఘటనకు బాధ్యులుగా పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ సేకరించిన సైఫాబాద్ పోలీసులు అనంతరం ఈ సంఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని సీపీకి సూచించారు. దీంతో, కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.