సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపు

CBI Director Alok verma

  • అవినీతి ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత కమిటీ నిర్ణయం
  • పంతం నెగ్గించుకున్న కేంద్రం

కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపు సబబు కాదని, వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చి 24 గంటలు కూడా గడవకముందే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో భేటీ అయిన సీబీఐ అత్యున్నత కమిటీ నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు గంటలపాటు క్షుణ్నంగా చర్చించిన అనంతరం కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. అవినీతి ఆరోపణలు ఉండటంతోపాటు విధి నిర్వహణ సక్రమంగా లేనందునే ఆయన్ను తొలగించినట్టు పేర్కొంది. వర్మను బలవంతంగా సెలవుపై పంపడం సబబు కాదని, ఆయన్ను తొలగించే అధికారం.. ఆయన్ను నియమించిన ఉన్నత స్థాయి కమిటీ మాత్రమే చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం కమిటీ బుధవారం సమావేశమైంది. ఇందులో ప్రధాని మోదీతోపాటు లోక్‌సభ పక్షనేత ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి ఉన్నారు. అలోక్‌ భవితవ్యంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ కమిటీ రెండు రోజుల పాటు చర్చలు జరిపింది. సీవీసీ కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నంచి ఆయన్ను తప్పించారు. కాగా, ఈ నిర్ణయం వెలువడటానికి కొన్ని గంటల ముందు ఐదుగురు సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్లు వర్మ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన బదిలీలను రద్దు చేశారు. అలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కడంతో వారిని బలవంతపు సెలవుపై పంపుతూ కేంద్రం గతేడాది అక్టోబరు 23న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే రోజున ఒడిశా క్యాడర్‌ అధికారి ఎం.నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలోక్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం రెండు రోజుల క్రితం ఆలోక్‌కు తిరిగి పగ్గాలు అప్పగించాల్సిందిగా తీర్పునిచ్చింది. దీంతో సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ బుధవారం తిరిగి బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కమిటీ సమావేశమై అలోక్ ను విధుల నుంచి తప్పించింది. ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న వర్మ.. అంతకంటే 21 రోజుల ముందే పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article